యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని, దీనిని తిప్పికొట్టాలన్నారు.
ఈ ఎన్నికల్లో నేరగాళ్లతో మన పోరాటం చేస్తున్నామని, వైసీపీవి నేర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అని చంద్రబాబు అన్నారు. విశాఖకు మోదీ వస్తే నిలదీసే ధైర్యం వైసీపీకి లేదా.. అని చంద్రబాబు అన్నారు. నిజాయతీపరులంతా టీడీపీలో చేరుతున్నారని, దశాబ్దాల వైరం వీడి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారని, కర్నూలులో కోట్ల, కేఈ కుటుంబాలే ఇందుకు రుజువు అన్నారు. విజయనగరంలో బొబ్బిలి, గజపతిరాజులే సాక్ష్యం అని, కురుపాంలో వైరం వీడి టీడీపీతో ఏకమయ్యారని, కడపలో వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశారని, ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతా రావాలి. వర్గాలకతీతంగా టీడీపీకి మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు.