YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి

రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో గుండ్రేవుల జలాశయ పథకం, వేదవతి ఎత్తిపోతల పథకం, రాజోలి బండ కుడి ప్రధాన కాలువ, తుంగభద్ర కాలువపై 72 కి.మీ. నుంచి 185 కి.మీ వరకు పైపులైన్ నిర్మాణ పథకాలకు శంఖుస్థాపన చేసి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.  వేదవతి ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాలకు 8.5 టీఎంసీల సాగునీటి ని అందించనున్నామన్నారు. దీంతో ఆలూరు, హాలహర్వి, హోలగుంద, చిప్పగిరి తదితర మండలాల్లో కరువు సమస్య ఉండదన్నారు. ఆర్డీఎస్ కాలువ ద్వారా 4 టీఎంసీల నీటిని 40వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఆస్పరి, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి అయితే 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని, ఇందుకోసం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తో మాట్లాడి సాధిస్తామన్నారు. తుంగభద్ర కాలువ పైపులైన్ పూర్తిచేసి ఖరీఫ్ లో 43 వేలు, రబీలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. బాగే పల్లి ఎత్తిపోతల పథకానికి రూ.12.50 కోట్లు మంజూరు చేస్తున్నామని సి.ఎం చెప్పారు. కోడుమూరు లో ఇండోర్ స్టేడియం, డిగ్రీ కాలేజి ని మంజూరు చేశారు. కుందూ నదిని పునరుద్దీక రించినందుకు ఇటీవల కేంద్రం చేతుల మీదుగా అవార్డును అందుకున్నామన్నారు. హంద్రీనీవా ద్వారా 68 చెరువులకు నీటిని ఇచ్చే పనులను వేగవంతం చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు అన్నివిధాలుగా కృషి చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతానికి 214 టీఎంసీల నీటిని ఇచ్చి వేసవిలో కూడా చెరువుల్లో నీటిని నింపామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు శిలాఫలకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి : 
రూ.1942 కోట్లతో వేదవతి ఎత్తిపోతల పథకం, రూ.1985 కోట్లతో రాజోలి బండ కుడి ప్రధాన కాలువ శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.2880 కోట్లతో చేపడుతున్న గుండ్రేవుల జలాశయం పైలాన్ ను ఆవిష్కరించారు. టీబీపీ దిగువ కాల్వ 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు రూ.1300 కోట్లతో చేపట్టనున్న పైపులైన్ పనుల శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 
ఉప ముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక. వారి సంక్షేమార్థం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎన్ఠీఆర్ భరోసా కింద పెన్షన్ ఐదు రెట్లు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద రూ.2000లు ప్రతినెలా ఇస్తున్నామన్నారు
జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల శంఖుస్థాపనలతో పశ్చిమ ప్రాంతంలో కరవు సమస్య ఉండదన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి సాగునీరు అందించి ఆయకట్టును స్థిరీకరించామన్నారు. వర్షాలు లేనప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని వినియోగించుకుని పంటలు కాపాడు కోవచ్చునన్నారు. 
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కే.ఈ.కృష్ణమూర్తి , జిల్లా ఇంఛార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, మంత్రులు ఫరూఖ్, దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, నంద్యాల ఎంపి ఎస్.పి.వై రెడ్డి, ఎంఎల్ సీలు కె.ఈ ప్రభాకర్ , ఎమ్మెల్యేలు మాణిగాంధీ, ఎస్.వి.మోహన్ రెడ్డి, జయ నాగేశ్వర రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ , ఎస్పీ పక్కీరప్ప, జె.సి పఠాన్ శెట్టి రవి సుభాష్ , ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Related Posts