టిటిడి అనుబంధ ఆలయమైన నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తిరుపతి జెఈవో బి. లక్ష్మీకాంతం తెలిపారు. ఈ ఆలయాన్ని శనివారం ఉదయం జెఈవో సందర్శించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అనుబంధ ఆలయాల ప్రాచశ్యం, వాటి చరిత్రను ప్రసారమాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఆలయాల అభివృద్ధికి, భక్తులకు కావాల్సిన సౌకర్యాలపై మరింతగా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగా రూ.2.5 కోట్లతో భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం జెఈవో ఆలయంలోని వాహనమండపం, క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.అంతకుముందు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయానికి జెఈవో రాగానే డెప్యూటీ ఈవో శ్రీధర్, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిక, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఉప ఆలయం అయిన శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి, పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో తిరుమలయ్య, ఆలయ సూపరింటెండెంట్ చంద్రమౌళిశర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీధర్ బట్టాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు