YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

కార్మికుల కన్నీటి కష్టాలు

  కార్మికుల కన్నీటి కష్టాలు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవి వచ్చిందంటే కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాలోని కార్మిక కుటుంబాలకు తాగునీటి కష్టాలు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటడం, నీటి వినియోగం అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భూగర్భ జలాలను తన గర్భంలో దాచుకున్న బొగ్గు బావులున్న సింగరేణి ప్రాంతాల్లో కూడా నీటి కష్టాలు సర్వసాధారణంగా మారాయి. భూగర్భ గనుల్లో పనులు చేపట్టాలంటే ఎప్పటికప్పుడు ఊరే నీటిని తోడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి జరిగే గనుల్లో నీటిని తోడుతుండగా ఇప్పటికే పూర్తయిన గనుల్లో నీరు నిండా చేరి ఉంది. ఈ విధంగా ఒక్కో ఏరియాలో రెండు, మూడు గనులైనా ఉంటాయి. భూగర్భంలో జల భాంఢాగారాల్లో నిలుస్తున్న గనుల నుంచి నీటిని సింగరేణి ప్రాంతాల్లోని కార్మిక కుటుంబాలకు అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఏళ్ల నాటి పథకాలే నేటికీ దిక్కవుతుండడంతో ప్రతి యేటా కార్మిక కుటుంబాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కొన్ని సంవత్సరాల కిందటి నీటి శుద్ధి ట్యాంకులు, ఉపరితల భాంఢాగారాలు ప్రస్తుత నీటి అవసరానికి సరిపోవడం లేదు.
చాలీచాలని ఇరుకు గదుల్లా ఉండే క్వార్టర్లలో వేసవిలో కార్మికులు పడే ఇబ్బందులు చెప్పజాలనివి. శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేసుకొనే అవకాశాన్ని యాజమాన్యం నేటికీ కల్పించకపోవడంతో రూ.50 వేలకు పైగా వేతనాలు లభించే కార్మికులు వేసవి ఉక్కపోతకు ఉబ్బితబ్బివవుతున్నారు. ఈ క్రమంలో రోజుకు మూడు, నాలుగు సార్లు స్నానం చేస్తే తప్ప వారికి ఉపశమనం లభించే పరిస్థితులు కన్పించడం లేదు. అధికంగా దుస్తుల వినియోగంతో నీటిని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మార్చి నెల మొదలు మూడు నాలుగు నెలల వరకు ఈ ఇబ్బందులు ప్రతీ ఏటా కొనసాగుతుంటాయి.
సింగరేణి కార్పొరేట్ ఏరియా పరిధిలో మొత్తం 2,582 క్వార్టర్లున్నాయి. ఇందులో మిలీనియం క్వార్టర్లు మినహా మిగిలిన క్వార్టర్లు అన్నీ పాతవే. ఈ క్వార్టర్లలో ఉన్న నీటి ట్యాంకుల సామర్థ్యం కూడా చాలా తక్కువ. దీంతో కొద్దిసేపటికే నిండిపోయి మిగిలిన నీరంతా వృథాగా పోతుంది. నీటి నిలువ సామర్థ్యం లేని కారణంగా సరఫరా అయిన నీటిని వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. రోజుకు ఉదయం, సాయంత్రం పంపులు వదిలితేనే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. బర్మాక్యాంపు ప్రాంతంలో హెచ్‌డీ, ప్రధాన వైద్యశాల సమీపంలో, బంగ్లోస్‌ ఏరియాలోని ఎండీ, జే,ఎస్‌, ఎంఏ క్వార్టర్లలోని పరిస్థితి దాదాపు ఇదేలా ఉంది. మిలీనియం క్వార్టర్లకు సరఫరా పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా వారికి సైతం అనుకున్నంత మొత్తంలో నీరు సరఫరా కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రైటర్‌బసీˆ్తలోని 48 స్పెషల్‌ సీ, 88 ఎన్‌సీ, 18 ఎంఏ, 72 ఎంబీ క్వార్టర్ల పరిస్థితి కొంత ఫర్వాలేదనిపించినా నీటి నిలువ సామర్థ్యం లేని కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేట్ ఏరియాల పరిధిలోని 2,582 క్వార్టర్లకు ప్రతి రోజూ 10 నుంచి 12 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచకపోవడంతో ఈ నీరంతా పూర్తిగా సద్వినియోగపడటం లేదు.
కొత్తగూడెం ఏరియాలో 4,399 క్వార్టర్లు ఉండగా అందులో కొత్తగా నిర్మించిన ఎంసీ క్వార్టర్లు, బంగ్లోసులోని అధికారుల క్వార్టర్లకు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కార్మికులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏరియాలోని రుద్రంపూర్‌, త్రీఇంక్లైన్‌, 4 ఇంక్లైన్‌, రుద్రంపూర్‌, గౌతంపూర్‌ ప్రాంతాల్లో క్వార్టర్లు వంద సంవత్సరాల కిందట నిర్మించబడినవి కావడంలో నీటి నిల్వ సామర్థ్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. క్వార్టర్లలో ఏ ఒక్క పూట రాకున్నా పంపులు ఎప్పుడొస్తాయా అని చూడాల్సి వస్తోందని కార్మిక కుటుంబాలు వాపోతున్నాయి. మామూలు రోజుల్లోనే ఈ పరిస్థితి ఉండగా వేసవిలో నీళ్ల ఇబ్బంది మరింతగా ఉంటోందని పేర్కొంటున్నాయి. అవసరమైన ప్రాంతాలకు ఎప్పటికప్పుడు నీటి ట్యాంకులను పంపించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రోజంతా గనుల్లో శ్రమకోర్చి పని చేస్తున్న కార్మికులకు నీటి కష్టాలు లేకుండా తగిన శాశ్వత ప్రణాళిక దిశగా యాజమాన్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Related Posts