యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం గెలుపు. రెండో లక్ష్యం పార్టీ విస్తరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం నమోదుచేసుకున్న ఎంఐఎం... ఇప్పుడు రెండో ప్రాధాన్య అంశమైన పార్టీ విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకుంటున్న ఆ పార్టీ... అందుకోసం వైసీపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ కోరితే ఆ మద్దతిస్తూ... ఆ పార్టీ తరపున ఏపీలో ప్రచారం చేస్తానని మరోసారి ప్రకటించారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. దీనిపై జగన్ నుంచీ స్పష్టమైన ప్రకటన రానప్పటికీ... వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్నది మజ్లిస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏపీలో ఎగరని తమ గాలిపటాన్ని అక్కడ కూడా ఎగరేసేందుకు లేదా ఎంతో కొంత ప్రభావం చూపుతూ పార్టీని విస్తరించేందుకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగపడతాయని ఎంఐఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లోని దారుసలాంలో నిర్వహిస్తున్న మజ్లిస్ 61వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ... వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తానన్న ఆయన... ఆంధ్రకు వస్తానని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కూ, ఆంధ్రలో జగన్ సారధ్యంలోని వైసీపీకి తమ మద్ధతు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ టైం నడుస్తోందనీ, ఈసారి ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని ఎంఐఎం భావిస్తోంది. నిజంగా జగన్ పార్టీ గెలిస్తే, ఆ పార్టీకి మద్దతిచ్చినందుకు ఎంఐఎంకి కూడా పాజిటివ్ మార్క్స్ పడతాయి. తద్వారా ఏపీలో పార్టీని విస్తరించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అదే వైసీపీ అధికారంలోకి రాకపోతే... ఎంఐఎం తెలంగాణకే పరిమితం అవుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి ఎక్కువ పార్టీల ప్రచారం వల్ల ఎన్నికలు హోరేత్తేలా ఉన్నాయి