యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ టిడిపి, వైసిపి, బిజెపి, కాంగ్రెస్ లలో ఎవరితో జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లడం లేదని పదేపదే స్పష్టం చేస్తున్నారు. కేవలం కమ్యూనిస్ట్ ల పొత్తు తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. టిడిపి తో పొత్తు ఉంటుందంటూ ఎంపి టిజి వెంకటేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సైతం భగ్గుమన్నారు. జనసేన వైసిపి పొత్తు పై కూడా కారాలు మిరియాలు నూరేశారు. కానీ చంద్రబాబు వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తూ వస్తుంది. కొద్ది కాలం క్రితం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ ల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.ఇటీవల అనేక సభల్లో చంద్రబాబు జనసేన అధినేత వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు.వైసిపి అధినేత జగన్ ను కించపరుస్తూ మాట్లాడే చంద్రబాబు అదే వయస్సు వున్న పవన్ విషయంలో మాత్రం సాఫ్ట్ గా మాట్లుడుతున్నారు. చాలా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు అంటూ మాట్లాడుతూ ఆయన చేసే వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ అవి నిజమే అనడం గమనార్హం. తాజాగా తనకు యుద్ధం వస్తుందని రెండేళ్లక్రితం తెలుసంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. బిజెపి ఘాటుగా రియాక్ట్ కూడా అయ్యింది. ఆ పార్టీకి చెందిన జివిఎల్ చంద్రబాబు స్క్రిప్ట్ నే పవన్ చదివి వినిపిస్తున్నారని ఆ తరువాత దానిని బాబు సమర్థిస్తున్న విషయం గమనించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. దీనిపై చంద్రబాబు కానీ పవన్ కానీ ప్రతిస్పందించకపోవడం చర్చనీయాంశం. టిడిపి, జనసేన నడుమ పొత్తు లేకపోయినా ఇరు పార్టీలు ఒకరి సహకారం మరొకరు తీసుకునే ఎన్నికల్లో పాల్గొంటారన్న విషయం ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారింది.