YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుమలత కే సీటు లేదిక్కడ...

 సుమలత కే సీటు లేదిక్కడ...
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సినీ నటి, మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అంబరీష్ మృతితో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు సుమలత ప్రకటించారు. అంబరీష్ ఆశయసాధనకు తాను తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెడతానని చెబుతున్న సుమలత మాండ్య నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాలన్నది కూడా సుమలత అభిమతం. అంబరీష్ కొనసాగిన పార్టీ నుంచే తాను కూడా పోటీ చేస్తానని ఆమె చెప్పుకొస్తున్నారు. మండ్య నియోజకవర్గం నుంచి సుమలతకు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. అయితే ఆ నియోజకవర్గం జనతాదళ్ ఎస్ చేతుల్లో ఉంది. మాండ్య లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో శివరామగౌడ ఇటీవల విజయం సాధించారు. ఇక్కడ జనతాదళ్ ఎస్ కు పట్టు ఎక్కువ. కేవలం ఎనిమిది నెలల కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేసిన శివరామగౌడను కాదని ఆ సీటును కాంగ్రెస్ కు ఇచ్చేందుకు జనతాదళ్ ఎస్ వర్గాలు అంగీకరించడం లేదు. ఉప ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు పన్నెండు స్థానాలను జేడీఎస్ కోరుతున్న సంగతి తెలిసిందేసుమలత మాత్రం పట్టుదలతో ఉన్నారు. తాను మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని గట్టిగా సంకేతాలు పంపారు. అంబరీష్ అభిమానులతోనూ, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ సుమలత ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమలతను ఒప్పించి మాండ్య నుంచి కాకుండా మరోచోట నుంచి పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. సుమలత, అంబరీష్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులుండటంతో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.కానీ సుమలత మాత్రం తాను పట్టిన పట్టు విడవడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొత్తులో భాగంగా మాండ్య స్థానం జేడీఎస్ కు వెళుతుందని కాంగ్రెస్ నేతలు నచ్చ జెప్పి చూసినా సుమలత అంగీకరించడం లేదు. ఇంకో ప్రతిపాదన కూడా సుమలత ఉంచినట్లు తెలుస్తోంది. మాండ్య నుంచి ఖచ్చితంగా పోటీచేయాలని భావిస్తే జనతాదళ్ ఎస్ తరుపున పోటీ చేయాలన్న ఆఫర్ ను కూడా సుమలత సున్నితంగా తిరస్కరించారు. అంబరీష్ కాంగ్రెస్ లోనే ఉన్నారని, తాను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాండ్య స్థానం నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టి కూర్చున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఆమె చెబుతుండటంతో కాంగ్రెస్ నేతలు తలలుపట్టుకుంటున్నారు.

Related Posts