యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఐటీ గ్రిడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసుల మధ్య పెద్ద వివాదాన్ని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్ల జాబితా ఆధార్ కార్డుల వివరాలు మొత్తం డేటా తారుమారు చేసేందుకు కుట్ర పన్నుతోందని కొద్దిరోజుల కిందట వైఎస్ఆర్సిపి విజయసాయి రెడ్డితోపాటు లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ కంపెనీల పైన దాడులు నిర్వహించారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ లో ఉన్న ఐటిగ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన తెలంగాణ పోలీసులు కంప్యూటర్స్ విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్ కంపెనీలో పని చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకొని భాస్కర్ కోసం ఆరా తీశారు. కూకట్ పల్లి లోని బ్లూఫ్రాగ్ కంపెనీతో పాటు ఐటీ గ్రిడ్ కంపెనీ వద్ద తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసుల ను అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న నలుగురు వ్యక్తులను తమకు అప్పగించాలని కోరినా అందుకు నిరాకరించారు. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజర్ అశోక్ తమ నలుగురు సిబ్బంది కనిపించడం లేదంటూ వెంటనే తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న వారిని చూపించాలని న్యాయమూర్తి ఎదుట విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీమూలంగా తెలంగాణ-ఆంధ్ర మధ్య వివాదం రాజుకుంటోంది. ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆంధ్ర పోలీసులకు చుక్కెదురైంది. విషయం ముందుగానే పసిగట్టిన తెలంగాణ పోలీసులు లోకేశ్వర్ రెడ్డిని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. ఐటీ గ్రిడ్ బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు తాళం వేసిన పోలీసులు అనుమతి లేకుండా లోపలికి పంపేది లేదని ఆంధ్ర పోలీసులకు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆంధ్ర పోలీసులు అయోమయానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఐటీ గ్రిడ్ కంపెనీ బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఆంధ్ర ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వివరాలు ప్రభుత్వమే అందించిందని ఆ కంపెనీలపై కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ట్విట్టర్లో మండిపడ్డారు. అయితే లక్షలాది మంది జనాల పర్సనల్ డేటా గోల్ మాల్ జరుగుతోందని, దీనివల్ల చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని దీనిపై ఫిర్యాదు మేరకు తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ తెలంగాణ పోలీసులు తెలిపారు. ఆంధ్ర పోలీసులకు తమకు ఎలాంటి గొడవలు లేవని కేవలం ఇదంతా కల్పితం అని కొట్టిపారేశారు మొత్తానికి ఆంధ్ర పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా…? లేదంటే టీడీపీ చేస్తున్న ఆరోపణలు మేరకు కేసీఆర్, జగన్ వేధింపులకు గురి చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది