యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎట్టకేలకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓ వైపు పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడంతో పాటు ప్రజల్లోకి వెళుతున్నారు. వారం రోజులుగా రాయలసీమ జిల్లాలను చుట్టి వస్తున్నారు. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా రెండు నెలలే సమయం ఉంది. ఇప్పటివరకు కూడా జనసేన కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకువెళ్లలేకపోయారు. పార్టీ స్థాపించి ఐదేళ్లు అవుతున్నా ఇంకా కొత్త పార్టీగానే ఉంది పరిస్థితి. తనకు కొంత పట్టున్న, కాపు సామాజకవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో ఆయన పార్టీని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని తయారు చేసుకోలేదు. కేవలం పవన్ కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఫ్యాన్స్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందని అనుకుంటున్నారా ? లేదా పవన్ టార్గెట్ ఈ ఎన్నికలు కాదా ? అన్నట్లుగా ఉంది జనసేన పరిస్థితి.ఇక, పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారని చెప్పారు. ఎవరు చెప్పారో మాత్రం చెప్పలేదు. పవన్ ఏ ఉద్దేశ్యంతో చెప్పినా దేశంలో ప్రస్తుతం నెలకొన్న భావోద్వేగ పరిస్థితుల్లో పవన్ ఈ మాట మాట్లాడటాన్ని ఆయన అభిమానులు మినహా ఇతరులు ఎవరూ హర్షించలేరు. ఇక, తనకు కులం, మతం లేదని, కులమతాలకు అతీతంగా కొత్త రాజకీయాన్ని చేస్తానని పవన్ చెబుతున్నారు. అయితే, తనకు కులాల పట్టింపు లేదని చెబుతూనే ఆయనే కులాల ప్రస్తావన తీసుకువస్తున్నారు. కులాల పునాధులపై రాజకీయాలు చేసే వారు కులాల వారీగా ప్రజలను ఆకట్టుకోవడం సహజం. కానీ, పవన్ నుంచి కొత్త తరహా రాజకీయాలను అంతా ఆశిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాయలసీమ పర్యటనలో ఆయన రెడ్డి అంటే ఏంటో అర్థం చెప్పి రెడ్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేసే పవన్ ఎందుకు కులాల ప్రస్తావన తెస్తున్నారో తెలియడం లేదు.ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్షాలకు సమాన దూరాన్ని పాటించాలి. రెండు పార్టీలనూ ఎండగట్టాలి. ఆ మాటకొస్తే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడితేనే తను ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తారు. కానీ, పవన్ మాత్రం అధికార పక్షం కంటే ప్రతిపక్ష పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటేనని, ఇద్దరు మళ్లీ కలుస్తారని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో ఇటువంటి అనుమానాలను, ప్రచారాలను పటాపంచలు చేసేలా పవన్ వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, పవన్ మాత్రం అధికార పక్షం కంటే ఎక్కువగా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తూ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఇలా చేస్తే వైసీపీ ప్రచారం నిజమే అని ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉంది. ఇదే జరిగితే జనసేనకు నష్టమే. మరి, పవన్ వ్యాఖ్యలు, విధానం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందేమో చూడాలి