యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇల కైలాసమైన శ్రీశైలం బ్రహ్మోత్సవ శోభతో కిటకిటలాడుతుంది. దేవదేవుల వైభవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తజనంతో శ్రీగిరి క్షేత్రం కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవ వేళ దేవదేవుల దివ్య వైభవాన్ని దర్శించుకొని ముక్తి పొందేందుకు భక్తజనం కఠోరదీక్షతో పాదయాత్ర చేసుకుంటూ చేరుకున్నారు. గజచర్మాంభర ధారియైన దేవదేవుడు దేవేరితో కలిసి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలంకృతంతో శోభాయమానంగా అలంకరించి ఆలయ అర్చకులు, వేదపండితులు అలంకారమండపంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల నడుమ గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. కృష్ణదేవరాయగోపురం నుంచి గంగాధర మండపం వరకు ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ పురవీధుల్లోకి చేర్చారు. ఉత్సవం ఎదుట కోలాటాలు, చెక్కభజనలు, నృత్యాలు, ఢమరుక నాదాలతో ఆకట్టుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో దేవదేవుల దర్శనానికి శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకోవడానికి అనుమతించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వీఐపీ దర్శనం పాసులతో పాటు ఉచిత దర్శనం, రూ.200 శీఘ్రదర్శనం గుండా భక్తులు దర్శించుకున్నారు.