అమరావతిలోని ఉండవల్లిలో మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నాయకులతో అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం కానున్నారు.నియోజకవర్గ పరిధిలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి, చంద్రగిరి అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల గురించి చర్చించనున్నారు. హాజరైన నాయకులతో ముందుగా పరిశీలకులు మాట్లాడి, చంద్రబాబుకు పరిస్థితిని వివరిస్తారు. అనంతరం ఆయన వారితో విడివిడిగా సమావేశమవుతారు. కుప్పంలో చంద్రబాబు, పలమనేరులో అమరనాథరెడ్డి, చంద్రగిరిలో నాని ఇప్పటికే అభ్యర్థులుగా ఖరారయ్యారు.
ఇక చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట లోక్సభకు పోటీ చేయమని సూచించినా.. ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.దీంతో ప్రస్తుతానికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆమెకే ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక పూతలపట్టు, జీడీనెల్లూరులపై క్లారిటీ రాలేదు. పూతలపట్టులో లలితమ్మకు పోటీ లేకపోగా జీడీనెల్లూరులో మాత్రం టీడీపీ శిక్షణా శిబిరాల డైరెక్టర్, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి తన భార్య తనూజ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నగరి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాపై గట్టి అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది.
చిత్తూరులో టీడీపీ కార్పొరేటర్ల సమావేశం
చిత్తూరుకు చెందిన ఏడుగురు కార్పొరేటర్లు, గుడిపాల మండలానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, టీడీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్ తదితరులు వైసీపీలో చేరిన క్రమంలో టీడీపీకి చెందిన కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కఠారి హేమలత తదితరులు ఆదివారం సమావేశమయ్యారు.వారంతా పార్టీ మారేందుకు దారితీసిన కారణాలపై చర్చించుకున్నారు.వారంతా ఏదో ఆశించి వైసీపీలోకి వెళ్లారని, టీడీపీలో వున్నవారికే భవిష్యత్తు ఉంటుందని నేతలు హితబోధ చేశారు.