అమలాపురం రిజర్వుడు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి చెందిన అభ్యర్థుల ఎంపికకు దాదాపు మార్గాలు సుగమమయ్యాయి. ఒక్క పి.గన్నవరం నియోజకవర్గంలో ఆశావహులు ఎక్కువగా ఉండడం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత నియోజకవర్గ కోఆర్డినేటర్లనే వైసీపీ అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. చివరిక్షణాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు లేదా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సంపాదించిన నాయకులు వస్తే పార్టీ పెద్దలు పునరాలోచించే అవకాశాలున్నట్టు కూడా సమాచారం. అమలాపురం రిజర్వుడు లోక్సభ అభ్యర్థిత్వానికి అల్లవరం మండలం మొగళ్లమూరికి చెందిన చింతా అనూరాధ పోటీలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గ కోర్డినేటర్గా నియమితులైన ఆమె అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసే అవకాశాలున్నాయి.
అయితే టీడీపీ సిటింగ్ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని ఎలా నిర్దేశిస్తారనేది ప్రస్తుతం నియోజకవర్గ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అయితే అనురాధ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో అమలాపురం రిజర్వుడు అసెంబ్లీ నుంచి మాజీమంత్రి పినిపే విశ్వరూప్ పేరు అధిష్ఠానం ప్రకటించడమే తరువాయి. ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు పొన్నాడ సతీష్కుమార్, కొత్తపేట అసెంబ్లీ స్థానానికి ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్లు ఖరారైనట్టే. రాజోలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు అభ్యర్థిత్వానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.