వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు జిల్లాపై దృష్టి సారించారు. గుంటూరు లోక్ సభ నియోజకవర్గంపై శని, ఆదివారాల్లో వరుస సమీక్షలు నిర్వహించారు. జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సర్వే నివేదికలు, అభ్యర్థుల వ్యక్తిత్వం, గెలుపు అవకాశాల ప్రాతిపదికగా ఎన్నికల బరిలోకి దిగేందుకు ముగ్గురికి పచ్చజెండా ఊపారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మరోమారు గల్లా జయదేవ్ ను ఖరారు చేశారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొన్నూరు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి నుంచి అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. నేతలను ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పార్లమెంట్ లో బీజేపీని, ప్రధాని మోదీని ఎండగట్టి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గల్లా జయదేవ్ తిరిగి గుంటూరు నుంచి పోటీ చేయనున్నారు. ఉండవల్లిలో రెండురోజుల పాటు జరిగిన సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎంపీ అభ్యర్థిగా జయదేవ్ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన జయదేవ్ వారసత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యక్ష రాజకీయాలోకి వచ్చారు. 2014లో తొలి ప్రయత్నంలోనే జయదేవ్ గుంటూరు ఎంపీగా గెలుపొంది లోక సభలో అడుగు పెట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్ సభలో గళం విప్పిన జయదేవ్ ఐదు కోట్ల ఆంధ్రుల మన్నన్నలు పొందారు. ఇప్పటికే ఆయన ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో మంగళగిరి, గుంటూరు తూర్పు అసెంబ్లీ సీట్లు మినహా గుంటూరు పార్లమెంట్, మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.