వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని చాలావరకు ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... లోక్‌సభ అభ్యర్థులపై మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించి... వాటి పరిధిలోకి వచ్చే శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై మాత్రమే ఆయన స్పష్టతనిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై మాత్రం సమయం తీసుకుంటున్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని ఆయన దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండటంతో... నాలుగు లోక్‌సభ స్థానాల్ని ఆ పార్టీకి కేటాయించి, తెదేపా 21 చోట్ల పోటీ చేసింది.
రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇంతవరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, చిత్తూరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై మాత్రమే స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీల్లో కె.రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం), పి.అశోక్‌గజపతిరాజు (విజయనగరం), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని నాని (విజయవాడ), గల్లా జయదేవ్ (గుంటూరు), నిమ్మల కిష్టప్ప (హిందూపురం), శివప్రసాద్ (చిత్తూరు) మళ్లీ బరిలోకి దిగనున్నారు. అరకులో కిశోర్‌చంద్ర దేవ్, కాకినాడలో చలమలశెట్టి సునీల్, అమలాపురంలో హరీష్ మాథుర్ (దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు), కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్టే.అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, కుమారుడు పవన్ కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. కిశోర్‌చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, చలమలశెట్టి సునీల్ ఇటీవలే తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. మిగతా లోక్‌సభ స్థానాల్లో ఆశావహులు ఎక్కువే ఉన్నా... మరింత విస్తృత కసరత్తు తర్వాతే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ తెదేపాలో చేరితే ఆయనే అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఏలూరు టికెట్‌ను ప్రస్తుత ఎంపీ మాగంటి బాబుతో పాటు, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ ఆశిస్తున్నారు. నరసాపురం అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు. నెల్లూరులో బలమైన అభ్యర్థి కోసం పార్టీ వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట నుంచి సిట్టింగ్ 01. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు.