నవ్యాంధ్రలో 2014 జూన్ 8న ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు రైతు రుణ మాఫీ ఫైలుపై మొట్ట మొదటి సంతకం చేసినా అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు.ఆర్థిక సంస్థల వద్ద అప్పుల కోసం సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మూడవ విడత సమయంలో విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ. వేయ్యేసి కోట్ల చొప్పున అప్పులు తెచ్చినా ఇంకా రైతులకు రూ.300 కోట్ల వరకు చెల్లించాలి. నాల్గవ విడతకు 2018-19 బడ్జెట్‌లో రూ.4,100 కోట్లు కేటాయించినా నిధులు సమకూరలేదు. ఇప్పుడే ఐదవ విడత ఇస్తామనడంతో అంతే మొత్తంలో డబ్బులు కావాలి. కాగా 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మాఫీకి రూపాయి కూడా ప్రతిపాదించలేదు. పది శాతం వడ్డీతో సహా మాఫీ చేస్తామన్న రూ.24,500 కోట్లలో మూడు విడతల్లో కలిపి రూ.15,166 కోట్లు చెల్లించారు. ఇంకా కనీసం రూ.9,300 కోట్లు కావాలి. ఆగమేఘాల మీద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు తయారు చేయించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టాలని చూడగా దానిపై ఒక జాతీయ బ్యాంక్ అప్పు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది ఈ పదవీ కాలానికి సంబంధించిన చివరి సంతకాలు చేసే సమయానిక్కూడా తొలి సంతకం పూర్తి స్థాయిన ఆచరణకు నోచుకోలేదు. ఇంకా నాలుగు, ఐదు విడతల మాఫీ చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది. అది కాకుండా మూడవ విడతలో సుమారు రూ.300 కోట్లు బకాయి పడింది. అన్నీ కలుపుకొని మాఫీ చెల్లింపుల కింద కనీసం రూ.9,300 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు 38 లక్షల మంది రైతులు మాఫీ సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు అదీ ఏడాది చివరి త్రైమాసికంలో అంత మొత్తంలో నిధులు సమీకరించి విడుదల చేయడం కష్టమేనని తెలిసినా ఎన్నికల్లో మరోసారి రైతులను మభ్య పెట్టేందుకు మాఫీ బకాయిల మొత్తాన్నీ ఒకేసారి చెల్లిస్తామని కొన్ని మాసాల కిందనే సర్కారు హామీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు మాఫీ సొమ్మును రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆన్‌లైన్ ద్వారా జమ చేయగా అందుకు భిన్నంగా పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చేస్తామంటూ నెల రోజుల నుంచి చెబుతూ వచ్చింది. ఇంతలో అన్నదాత సుఖీభవను ముందుకు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద తొలి విడతలో గత నెల 18న రూ.వెయ్యి వేశాక మాఫీ బకాయిలపై సర్కారు మనసు మార్చుకుందని సమాచారం. మాఫీ బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం నిర్వహించే చివరి కేబినెట్‌లోనూ మాఫీపై స్పష్టమైన నిర్ణయం ఉంటుందో లేదోనని ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ఆస్తుల సృష్టికి బ్యాంకులు అప్పులివ్వాలితప్ప మాఫీ వంటి పథకాలకు ఇవ్వొద్దని ఆర్‌బిఐ, కేంద్రం నుంచి తమకు ఆదేశాలున్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ తదితర సంస్థలను రైతు సాధికార సంస్థ సంప్రదించినా పెద్దగా అప్పు పుట్టలేదని సమాచారం. రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఎర్ర చందనం దుంగలను పట్టుకొని వేలం వేసి తద్వారా వచ్చిన నిధులతోనైనా రుణ మాఫీ చేస్తామంది సర్కారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో రుణాలు సమీకరిస్తానంది. ఆర్‌బిఐని రుణాలు రీషెడ్యూల్ చేయాలనీ కోరింది. ఇవన్నీ బెడిసికొట్టిన దరిమిలా మాఫీని ఐదు విడతల్లో అమలు చేస్తానంది. అనేక నిబంధనలు పెట్టి రూ.24,500 కోట్లకు కుదించింది. మొదటి విడత అనంతరం మిగతా నాలుగు విడతలకూ బాండ్లు జారీ చేస్తామని రైతులు ఎప్పుడైనా వాటిని అమ్ముకోవచ్చని ఊరించింది. ఆ ప్రయత్నాలూ విఫలమయ్యేసరికి చివరి రెండు విడతల సొమ్మును పోస్ట్ డేటెడ్ చెక్కుల రూపంలో ఇస్తానంది. చిట్ట చివరికి దానిక్కూడా ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతోంది!