యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగమేఘాలమీద స్థానిక శివాలయం ఎదురుగా శంకుస్థాపన చేశారు. జిఒ విడుదల, కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చకచకా నిర్వహించేశారు. ఎందుకంటారా? ఎన్నికలు ముందున్న తరుణంలో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను మంజూరు ఎన్నికల డ్రామాగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తగరపువలసలో కళాశాల మంజూరు చేయడం అభినందనీయమే. కానీ నాలుగు సంవత్సరాల 9 నెలల్లో కానీ నిర్మాణం ఎన్నికల షెడ్యూలు విడుదల కాబోతున్న సమయంలో ఈ శంకుస్థాపనపై భిన్నాభిప్రాలు వ్యక్తమవుతున్నాయి. తగరపువలసకు 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలభీమిలిలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలంటూ విద్యార్థులు ఏనాటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో డిగ్రీ కళాశాల అవసమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శంకుస్థాపన చేశారు కానీ స్థల కేటాయింపు, ఎంత నిధులు అనేతి స్పష్టత లేదు. గత ఎన్నికల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని ఊసే మరిచారు. 2016 జూన్ 19వ తేదీన ఇదే శివాలయం ఎదురుగా గొస్తనీ నదికి ఆనుకుని 4.09 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆర్టీసి డిపో, కాంప్లెక్స్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 6 నెలల వ్యవధిలోనే దీని నిర్మాణం పూర్తి చేస్తామంటూ అప్పటి సభలో మంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీకి నేటి వరకు దిక్కే లేకుండా పోయింది. ఆర్టీసి కాంప్లెక్స్ నిర్మాణానికి పునాది రాయి వేసి రెండేళ్లు పైబడుతున్నా నేటికి ఒక్క అడుగు ముందుకు కదలలేదని, ఇప్పుడు మంజూరైన కళాశాల నిర్మాణం, తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనన్న అనుమానం ఇక్కడ ప్రజల అనుమానాన్ని బలపరుస్తోంది. దానిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలనలో ఉన్న మంత్రి గారిదే.