యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాజకీయాల్లో ఈయన దిట్ట. సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నారు. సోదరుడి మరణంతో రాజకీయ అరంగేట్రం చేసిన దేవినేని కృష్ణాజిల్లా నందిగామ నియోజక వర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని విజయం సాధించారు. తర్వాత ఈ నియోజకవర్గం రిజర్వ్ కావడంతో మైలవరానికి మకాం మార్చుకున్నారు దేవినేని. ఇక్కడ నుంచి కూడా వరుస విజయా లు సాధిస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన దేవినేని తొలి సారి 12 వేల పైచిలుకు, తర్వాత 2014లో కేవలం 7 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇక, మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ దేవినేని మైలవరం నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మాత్రం దేవినేనికి తీవ్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున జోగి రమేష్ పోటీ చేయడం దేవినేనికి కలిసి వచ్చింది. అయితే, ఇప్పుడు మాత్రం జగన్ వ్యూహం మార్చుకుని ముందుకు సాగుతున్నారు. సీనియర్ రాజకీయనేత, టీడీపీలోనే కీలకంగా వ్యవహరించిన వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ టికెట్‌పై రంగంలోకి దిగనున్నారు. దీనికితోడు దేవినేనిపై సొంత పార్టీ నేతలే గుస్సాగా ఉన్నారు.తాము జెండా పట్టుకుంటేనే దేవినేని గెలుపు సాద్యమైందని, తాము ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తేనే మంత్రిగా ఆయ న పదవిని అనుభవిస్తున్నారని, కానీ, తాము మాత్రం ఆయన దర్శనం కోసం వేచి ఉన్నా.. కనీసం పట్టించుకోవడం లే దని ఇక్కడ టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనికితోడు వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీకి మంచి పలుకు బడి ఉండడం, ప్రజా సేవలో మంచి మార్కులు ఉండడంతో మెజారిటీ ప్రజలకు కేపీ వైపే మొగ్గుతున్నారు. సామాజికవర్గం పరంగాను, ఆర్థికంగాను మంత్రి ఉమాకు సరితూగే వ్యక్తిగా కృష్ణప్రసాద్ ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలోనే మైలవరం నియోజకవర్గం ఖర్చు పరంగా ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటి కానుందన్న రాజకీయ విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే, ఇక్కడే చాలా చిత్రమైన విషయం తెరమీదికి వస్తోంది. విజయవాడ ఎంపీ పరిధిలోనే ఈ నియజకవర్గం ఉంది. అయితే, ఎంపీపై మాత్రం ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదు. కేవలం ఎమ్మెల్యే పైనే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు అంటే ఎంపీ ఓటును టీడీపీకి, ఎమ్మెల్యే ఓటు ను వైసీపీకి వేయాలని భావిస్తున్నట్టు కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి ఇదే జరిగితే.. దేవినేని గెలుపు కోసం చాలా కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.