యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవి ప్రారంభంలోనే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా కనీసం తాగునీరు లేకపోయినా పట్టించుకున్న నాధుడే లేడని స్థానికులు వాపోతున్నారు. వాటర్ ట్యాంకు మోటారు చెడిపోతే మరమ్మతులు చేయించే తీరికా లేదు. మరో వైపు ప్రత్యామ్నాయంగా ఉన్న నీటి సౌకర్యాన్ని ఉపయోగించుకందామంటే రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాల్లో పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో కొలకలూరు గ్రామం బాపయ్యపేట ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య వర్ణనాతీతం. రూరల్ గ్రామం కొలకలూరు తెనాలి నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామం. ఈ గ్రామంలో ప్రాంతాల వారీగా వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అయితే బాపయ్యపేట ప్రాంతంలోని వాటర్‌ట్యాంకుకు సంబంధించి మోటారు మరమ్మతులకు గురైంది. మూడు రోజుల కిందట మరమ్మతులకు గురైతే పట్టించుకున్న నాధుడే లేడు. దీనికి తోడు వల్లభాపురం రక్షిత మంచినీటి పథకం నుంచి హాఫ్‌పేటకు తాగునీటిని అందించే పైప్‌లైను కొలకలూరు ఆర్ అండ్ బి రోడ్డు వెంబడి ఉంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బాపయ్యపేట వద్ద పైప్‌లైను పగిలిపోవటంతో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సైకిళ్ళు, ద్విచక్ర వాహనాలపై, ఆటోల్లో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ సిబ్బందికి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కార్యదర్శిని ఫోనులో వివరణ కోసం సంప్రదించగా ఆయన స్పందించలేదు. నీటి సమస్య నా దృష్టికి రాలేదు. ఇటీవలే కొలకలూరులో కొత్త మోటారు ఏర్పాటు చేశాం. అదే మరమ్మతులకు గురైందా.. మరో మోటారా అన్న విషయం కార్యదర్శి ద్వారా తెలుసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.