యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీలో పార్లమెంటుసభ్యులు ఈసారి ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎంపీలు సయితం ఢిల్లీ మాకొద్దు బాబోయ్ అంటున్నారు. అక్కడ జెండా పట్టుకుని నిలబడటం తప్ప ఒరిగేదేమీ లేదంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని భావించే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో ఎంపీల నుంచి పోటీకి విముఖత ఎక్కువగా కనపడుతోంది. తమకు రానున్న ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ వద్దే వద్దంటూ భీష్మించుకుని కూర్చుంటున్నారు. అసెంబ్లీ టిక్కెట్ల కోసం కన్పించే హడావిడి… ఆశావహుల రద్దీ అమరావతిలో ఎంపీ టిక్కెట్ల కు కన్పించడం లేదు.అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తాను ఎంపీగా పోటీ చేయనని చెప్పేశారు. ఆయన తన స్థానంలో కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. ఇక కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగనని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పేశారు. ఆయన తన భార్యకు జగ్గంపేట నియోజకవర్గం టిక్కెట్ అడుగుతున్నారు. ఇక ఒంగోలు పార్లమెంటు స్థానం తాను పోటీ చేయలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా తేల్చి చెప్పారు.కొద్దిరోజుల క్రితం అమలాపురం పార్లమెంటు సభ్యుడు పండుల రవీంద్ర బాబు పార్లమెంటు కు పోటీ చేయడం ఇష్టం లేకపోవడంతో ఏకంగా పార్టీనే మారారు. ఈయనకు ఈసారి టిక్కెట్ దక్కదన్న ప్రచారమూ పార్టీ మారడానికి కారణమంటున్నారు. ఈయన స్థానంలో దివంగత మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ ను బరిలోకి దించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయడానికి అనాసక్తి కనపర్చారు. దీంతో ఆయనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అలాగే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతీ శ్రీనివాస్ సయితం పార్లమెంటుకు మళ్లీ పోటీ చేయాల్సి వస్తుందన్న కారణంతోనే టీడీపీకి రాజీనామాచేసి వైసీపీ కండువా కప్పుకున్నారు.రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళి మోహన్ కూడా పోటీ చేయనని చెప్పేశారు. ఈయన పోటీ చేయకపోవడానికి చెప్పే కారణాలు సహేతుకంగా లేవు. తాను ట్రస్ట్ ద్వారా సేవలు చేసేందుకే పోటీ చేయడం లేదని ప్రకటించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే మాగంటి మురళీ మోహన్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈసారి ఓటమి తప్పదని సర్వేలు తేల్చడంతోనే మురళీ మోహన్ వెనకడుగు వేశారంటున్నారు. మాగంటి ప్లేస్ లో ముగ్గురి పేర్లు విన్పిస్తున్నాయి. ఒకటి బొడ్డుభాస్కరరామారావు, రెండు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మూడు సినీనటుడు ఆలీ. వీరి ముగ్గురిలో ఒకరి పేరు టీడీపీ అధినేత ఖరారు చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ అధికార పార్టీకి ఎంపీ టిక్కెట్ అంటేనే భయపడిపోతున్నారు. ఈ టిక్కెట్లు పార్టీలో ఖాళీగా ఉంటున్నాయి. పోటీ దారులు లేక పార్టీ అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది.