యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన శ్రీ భరత్ కి టీడీపీ హై కమాండ్ గట్టి షాక్ ఇచ్చిందని అంటున్నారు. తాతకు తగ్గ మనవడిని, ఆయన వారసత్వం తనదేనని గొప్పలు చెప్పుకున్న శ్రీ భరత్ కి మూర్తి వారసత్వం ఏంటో చూపిస్తోంది. మూర్తి చనిపోయేనాటికి ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ స్థానిక సంస్థల కోటాలో 2015లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో ఆ పోస్ట్ ఇపుడు ఖాళీగా ఉంది. మూర్తి వారసుడిగా శ్రీ భరత్ కి దాన్ని ఇవ్వాలనుకున్నా చివరకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇవ్వలేకపోయారు. అయితే మూర్తి తన రాజకీయ జీవితంలో రెండు పర్యాయాలు విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో ఆ పెద్ద పదవిపైన మనవడు శ్రీ భరత్ కన్నేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఎంపీ అభ్యర్ధిగా శ్రీ భరత్ ని ఎంపిక చేయడంలేదని అంటున్నారు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోవడంతో పాటు సామాజిక సమీకరణలు కూడా కలసిరాకపోవడం వంటివి కూడా భరత్ ఎంపికకు అడ్డంకిగా మారాయంటున్నారు.విశాఖ ఎంపీ సీటుకు మంత్రి గంటా శ్రీనివాసరావుని దింపేందుకు చంద్రబాబు చూస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా అయితే గెలుపు సులభం అవుతుందన్నది బాబు ఆలోచంగా ఉంది. అదే శ్రీ భరత్ అయితే కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఆదరిస్తుంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి కూడా అదే కమ్మ వర్గం కావడంతో పాటు ఆయనకు ఉన్న పరిచయాలు, పెద్దరికం వంటి వాటితో పోలిస్తే టీడీపీ క్యాండిడేట్ వీక్ అవుతారని అంటున్నారు. అందువల్ల గంటా రైన ఆప్షన్ అని పెట్టుకున్నారట. ఇక బాలకృష్ణ రెండవ అల్లుడు ట్యాగ్ భరత్ కి ఉంది. ఒకే కుటుంబం నుంచి పెద్దల్లుడు లోకేష్, బాలయ్య ఉన్నారు. చిన్నల్లుడు కూడా టికెట్ అడిగితే మూడు అయిపోతాయని ఆలోచనతో ఆపారని అంటున్నారు.ఇక మూర్తి నాలుగేళ్ళ పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. కేవలం రెండెళ్లు మాత్రమే పదవీకాలం ఉంది. ఆ పదవి కోసం శ్రీ భరత్ ని ఎంపిక చేయడం అంటే ఆయన్ని రాజకీయంగా వెనక్కు లాగినట్లేనని అనుకోవాలంటున్నారు. పైగా స్థానిక సంస్థల కోటాలో పదవి అది. ఎపుడు రాజకీయాలు ఎలా మారుతాయో తెలియదు. మరో మారు అవకాశం వస్తుందో కూడా తెలియదు. అందుకే శ్రీభరత్ స్థానంలో మరొకరిని ఈ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే ఇక్కడో విషయం కూడా ఉంది. శ్రీ భరత్ ని టీడీపీలో కీలకంగా చేస్తే రేపటి రోజున పెద్దల్లుడు లోకేష్ కి ఇబ్బంది అవుతుందని కూడా భావించి సైలెంట్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి తానే కాబోయే ఎంపీ అని సంబరపడినంత సేపు పట్టలేదు శ్రీ భరత్ కి అంటూ సెటైర్లు పడుతున్నాయి. వారసత్వంగా గీతం చైర్మన్ కావడం అంత ఈజీ కాదు ఎంపీ అంటే అని కూడా అంటున్నారు.