YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మొన్న కేసీఆర్... నిన్న జగన్ గాడ్ ఫాదర్ లకు ప్రదక్షిణలు

మొన్న కేసీఆర్... నిన్న జగన్ గాడ్ ఫాదర్ లకు ప్రదక్షిణలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఓట్ల సీజన్ దగ్గరకొచ్చేసింది. దాంతోపాటు గాడ్ ఫాదర్ స్వాములకూ డిమాండ్ పెరిగింది. గతంలో ఆధ్యాత్మిక వేత్తల ఆశీర్వచనాలు తీసుకుని ముందుకు వెళ్లడాన్ని శుభసంకేతంగా నాయకులు భావించేవారు. వారి ముందు ప్రణమిల్లడాన్ని గౌరవసూచకంగా తలచేవారు. ఇప్పుడు రాజకీయం మారింది. పొలిటికల్ గేమ్ లో స్వాములూ పాత్రధారులవుతున్నారు. సలహాలు, సూచనలు లోపాయకారీ సహకారం వంటివన్నీ స్వాముల సమక్షంలోనే సాగిపోతున్నాయి. పొత్తులకు అనువైన మార్గదర్శకత్వమూ వారి నుంచే పొందుతున్నారు. నిజానికి స్వాములకంటే రాజకీయ నాయకులే మేధావులు. ఆధ్యాత్మిక వేత్తలను తమ రాజకీయ క్రీడలో భాగంగా చక్కగా వాడుకుంటున్నారు. గతంలో భక్తి ప్రపత్తులతో మోకరిల్లితే ఇప్పుడు బాసట గా నిలుపుకునేందుకు భావి అవసరాల ద్రుష్ట్యా ఆశ్రయిస్తున్నారు. దైవస్వరూపులుగా భావిస్తూ సదాచార పరాయణులను పూజించడం రాజకీయ నాయకులకు కొత్తకాదు. ఇందిర కాలం నుంచి ఈ అలవాటు ఉంది. అయితే ఆ కాలంలో రాజకీయ ముహూర్తాలు పెట్టించుకోవడానికి, యజ్ణయాగాదులు చేయించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. స్వాములు సైతం రాజకీయ విమర్శలు చేసేవారు కాదు. వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో స్వాములు రాజకీయ ఆశ్రితపక్షపాతంతో ఆరోపణల ఊబిలో కూరుకుపోతున్నారు. విశాఖ పట్టణానికి చెందిన స్వామి స్వరూపానంద అధికారపార్టీకి వ్యతిరేకిగా ముద్ర పడ్డారు. ప్రత్యక్ష,పరోక్ష రూపాల్లో ఆయన అధికారపార్టీని విమర్శిస్తూ ఉంటారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. జగన్, కేసీఆర్ లు సైతం స్వరూపానందకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాయకులకు ప్రజలపై విశ్వాసం ఉండాలి. స్వామీజీలు రాజకీయాన్ని ప్రోత్సహించడం ఆధ్యాత్మిక బాటనుంచి పక్కదారి పట్టడమే. అదే సమయంలో నాయకులకూ తమపై తమకు నమ్మకం లేని స్థితినే చాటుతుంది. క్రీస్తుపూర్వం నుంచి మధ్యయుగాల వరకూ మతాధిపతులు రాజులనే శాసించేవారు. ప్రజాస్వామ్యంలో అందులోనూ లౌకిక దేశంలో మఠాధిపతులకు పెద్దపీట వేయడం నాయకుల బలహీనతనే బయటపెడుతుంది. అటు తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. యజ్ణాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. చంద్రబాబు నాయుడు జలహారతులు, పుష్కరాలు, తీర్థాలు నిర్వహించడంలో రికార్డు స్రుష్టిస్తున్నారు. ప్రజల ద్రుష్టిలో పడుతూ మతపరమైన అంశాలను తమకు ముడిపెట్టుకుంటున్నారు. మతం వ్యక్తిగత అంశం అయినప్పటికీ తాము అందులో భాగమని చాటుకోవడం ద్వారా మెజార్టీ ప్రజలను మెప్పించాలనే ఎత్తుగడా అందులో భాగమే. లేకపోతే తమ సొంత ఇష్టానిష్టాలను ప్రజల ముందు బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ’హారతులు పట్టండి. అందరూ పుష్కరాల్లో పాల్గొనండి.‘ అంటూ ప్రభుత్వాధినేతలే పిలుపునివ్వడం ఒక ప్రాముఖ్యమున్న రాజకీయఅంశంగానే చూడాలి. రాజుల కాలంలో రాజకీయం ,మతం కలగాపులగంగా ఉంటూ వస్తుండేవి. స్వాతంత్ర్యానంతర కాలంలో మైనారిటీలను ఆకట్టుకునే చర్యల ద్వారా గంపగుత్తగా వారి ఓట్లు నొల్లుకునే ప్రయత్నాలను పార్టీలు చేపట్టాయి. దీంతో హిందూ మెజార్టీ వర్గం కాంగ్రెసు , కమ్యూనిస్టు వంటి పార్టీలకు దూరమయ్యింది. ఈ ప్రమాదం తమకూ ఎదురవుతుందని ప్రాంతీయ పార్టీలే ముందుగా గ్రహించాయి. మెజార్టీ వర్గం దూరమైతే భారతీయ జనతాపార్టీ వంటి హిందూత్వభావనలు కలిగినవారు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ప్రాంతీయ నాయకులు సైతం తమ ధోరణిని , వైఖరిని మార్చుకుంటున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.ఆంధ్రప్రాంతానికి చెందిన చిన్నజీయర్ స్వామి తెలంగాణలో టీఆర్ఎస్ కు అనధికార ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్నారనే చెప్పుకోవాలి. యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన నరసింహ క్షేత్రానికి యాదాద్రిగా నామకరణం చేయడం మొదలు అనేక విషయాల్లో ఆయన సలహాలు,సూచనలే అమలవుతున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చినజీయర్ ఆశీర్వచనాలు, ముహూర్తాలతోనే కేసీఆర్ ముందడుగు వేస్తుంటారనేది టీఆర్ఎస్ వర్గాల భావన. టీఆర్ఎస్ మార్గదర్శకత్వంలో వైసీపీ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ సహా వైసీపీ అగ్రనాయకులు చిన్నజీయర్ తో ప్రత్యేక ఆంతరంగిక సమావేశం జరపడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. నేరుగా వైసీపీ, టీఆర్ఎస్ సమావేశం జరిపితే ఆంధ్రా ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఈ స్థితిలో మధ్యేమార్గంలో ఆధ్యాత్మిక రాజకీయాన్ని నమ్ముకుంటున్నారా? అన్న అనుమానాలను తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్వామీజీలతో ఆంతరంగిక సమావేశాలు రాజకీయపార్టీలకు మంచి చేస్తాయో లేదో స్పష్టంగా చెప్పలేం. కానీ నాయకులు, రాజకీయాలు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం నెగటివ్ పాక్టర్ గానే చూడాల్సి ఉంటుంది. రాజకీయాలతో ప్రభావితమై తమ అసలు పనిని వదిలేసిన స్వాములు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సక్సెస్ అవుతున్న దాఖలాలు లేవు. భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుని తెలంగాణలో ఆ పార్టీని అధికారంలోకి తెస్తానంటూ ప్రచారకర్తగా మారిన పరిపూర్ణానంద వైఫల్యమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఏదేమైనప్పటికీ సొంతబలాన్ని, బలగాన్ని, ప్రజామద్దతును నమ్ముకోవడమే నాయకులకు అన్నివేళలా శ్రేయస్కరం.

Related Posts