YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమరవీరులకు 110 కోట్ల విరాళం

 అమరవీరులకు 110 కోట్ల విరాళం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆయనకు కంటిచూపు లేదు. కానీ ఆ మానవతామూర్తి దాతృత్వం ముందు చూపే ఓడిపోయింది. రాజస్థాన్ లోని కోటాకు చెందిన శాస్త్రవేత్త ముర్తజా ఏ హమీద్ (44)  పుల్వామా ఉగ్ర దాడి అమరవీరులకు రూ.110 కోట్ల భూరి విరాళం ప్రకటించి దేశాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. అమరవీరుల కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి  జాతీయ విపత్తు నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ మేరకు ప్రధాని మోదీతో తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ  ప్రధాని కార్యాలయానికి ఆయన ఒక మెయిల్ చేశారు. చూపు లేకుండా జన్మించిన ముర్తజా హమీద్ ను ఇంత భారీ విరాళాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారని మీడియా అడగ్గా మాతృదేశం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన వీరుల్ని స్మరించుకోవడం మన బాధ్యత. వారి కుటుంబాల్ని ఆదుకోవడం మన విధి అని చెప్పారు. కామర్స్ లో పట్టభద్రుడైన 
హమీద్ శాస్త్రవేత్తగా మారి ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నారు. ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ అనే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.
జీపీఎస్  సాయం లేకుండానే ఒక వాహనం లేదా వస్తువు ఎక్కడ ఉందనే విషయాన్ని సులభంగా ఈ విధానం ద్వారా కనుగొనవచ్చు. పుల్వామా తరహా ఉగ్రదాడులు జరుగకుండా నిరోధించవచ్చు. ఈ ప్రతిపాదనను పూర్తి ఉచితంగా భారత ప్రభుత్వానికి, నేషనల్ హైవేస్ అథారిటీకి 2016 సెప్టెంబర్లో అందజేసినట్లు హమీద్ చెప్పారు. 
అయితే, రెండేండ్ల నిరీక్షణ అనంతరం 2018, అక్టోబర్లో కేవలం ప్రాథమిక అనుమతి మాత్రమే లభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన మీరు శాస్త్ర, సాంకేతిక రంగం వైపు ఎలా వెళ్లారని మీడియా ప్రశ్నించగా  2010లో జైపూర్ లోని ఓ పెట్రోల్ పంపులో జరిగిన అగ్ని ప్రమాదం నన్ను ఆలోచింపజేసింది. పెట్రోల్ పంపు ఉన్న ప్రదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మంటలు ఎలా వ్యాపిస్తున్నాయనే విషయంపై  అధ్యయనం చేశాం. అనంతరం ఫ్యూయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ ఆవిష్కరణ దిశగా అడుగులు వేశా అని హమీద్ వివరించారు. మరోవైపు జాతీయ విపత్తు నిధి డిప్యూటీ  సెక్రటరీ అగ్నికుమార్ దాస్ వెంటనే హమీద్ కు సంబంధించిన పూర్తి వివరాల్ని పంపించాలని కోరారు. త్వరలోనే హమీద్ ప్రధానిని కలిసే అవకాశం ఉన్నది.

Related Posts