యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర కాబినేట్ సమావేశంలో టీడీపీ డేటా హైదరాబాద్ లో చోరీ అవడం ప్రధాన చర్చకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై కేసులు పెడతామని తెలంగాణ పోలీసులు హెచ్చరించడాన్ని కేబినేట్ భేటిలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో ఓ మంత్రి మాట్లాడుతూ టీడీపీ డేటాను దొంగిలించి ప్రత్యర్థులకు అప్పగించారని అన్నారు. అంతే కాకుండా డేటా చోరీని కప్పిపుచ్చుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఊళ్లో సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారాన్ని ప్రభుత్వమే పారదర్శకంగా వెల్లడిస్తోందని అన్నారు. డేటా చోరీ కేసుల వ్యవహారంపై దేశమంతా చర్చ జరగాలని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కాగా సజ్జనార్ కామెంట్లను మరో మంత్రి కేబినెట్ లో ప్రస్తావించారు. హైకోర్టు చివాట్లు పెట్టడంతో సజ్జనార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోవద్దని కేబినెట్ లో విస్తృతంగా చర్చించారు. దీన్ని ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ రూపొందిద్దామన్న మంత్రులతో చంద్రబాబు అన్నారు.
ఫారం-7 దుర్వినియోగంపై పోలీసుల వైఖరి సరిగాలేదని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు లేవనెత్తారు. నమోదైన కేసులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు ఏం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రులు ఫిర్యాదు చేయాలని సూచించారు. 54 లక్షల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఈసీకి జగన్ ఫిర్యాదు వెనుక ఫారం-7 దుర్వినియోగం కుట్ర ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీ డేటా చోరీ కాలేదని అధికారులు చెప్తున్నారని, డేటా క్లౌడ్ ఫార్మాట్లో ఉండటం వల్ల చోరీ కుదరదని ఐటీ సెక్రటరీ విజయానంద్.. సీఎం చంద్రబాబుకు తెలిపారు.