యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ జగన్ తన జిల్లాల పర్యటనలతో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలను ఎదుర్కొనేందుకు ధీటుగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, కడప జిల్లాల్లో సమర శంఖారావం సభలను నిర్వహించారు. ఈ సమావేశాలకు పార్టీ కార్యకర్తలతో పాటు బుత్ కమిటీలతోనూ ఆయన సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఒక మాయావితో యుద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటిస్తున్నారు. ఓట్ల తొలగింపు నుంచి, కార్యకర్తలపై కేసుల వరకూ ఆయన ప్రస్తావిస్తూ క్యాడర్ లో నూతనోత్తేజం నింపుతున్నారు.ప్రతి ఓటు ఎంత కీలకమైందో జగన్ వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రమేనని, ఈసారి ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని కార్యకర్తలు గుర్తించాలని చెబుతున్నారు. ఓటు ఉందో తెలుసుకోవడం, దొంగఓట్లు ఉంటే వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేస్తామని భరోసా ఇస్తున్నారు. అంతేకాకుడా ఈ ఐదేళ్లు కార్యకర్తలు పడిన కష్టం.. నష్టం గురించి తనకు స్పష్టంగా తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు.ఇక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ చేసే జిమ్మిక్కులను కూడా జగన్ ఈ సమావేశాల్లో వివరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కు 36గంటల ముందు లగడపాటి రాజగోపాల్ చేత ఒక దొంగ సర్వేను చంద్రబాబు బయటపెట్టాడని, ఆ సర్వే ప్రభావం పోలింగ్ మీద ఉంటుందన్న ఏకైక కారణంతోనే లగడపాటి తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పారన్నారు. ఇటువంటి ప్రమాదాలు మనకూ వస్తాయన్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో వచ్చే సర్వేలను నమ్మవద్దని జగన్ కార్యకర్తలకు సూచించారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామాన చెప్పాలన్నారు.ఇక జగన్ మీడియాను కూడా వదిలిపెట్టలేదు. . డేటా చోరీ జరిగితే ఆ నెపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైకే నెట్టే ప్రయత్నాన్ని ఎల్లో మీడియా చేస్తుందన్నారు. వాటి తాటాకు చప్పుళ్లకు తాను బెదరనని చెప్పారు. చంద్రబాబు లాంటి మాయావితో ఎలా యుద్ధం చేయాలో తనకు తెలుసునన్నారు. కార్యకర్తలే ఈ నలభై రోజులు కష్టపడి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. మొత్తం మీద జగన్ శంఖారావం సభల ద్వారా ఇటు క్యాడర్ లో ఉత్తేజం నింపడంతో పాటు వారికి ప్రత్యర్థి పార్టీని ఎలా ఎదుర్కోవాలో చెబుతుండటం గమనించ దగ్గ అంశం. చంద్రబాబు వేసే ప్రతి ఎత్తుకు పైఎత్తు వేస్తామన్న ధీమాను కార్యకర్తల్లో కల్పించారు జగన్.