యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అధికారంలో ఉన్నామన్న సంతోషం లేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గట్టెక్కుతామన్న ఆశలేదు. ఇలా కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు సొంత తలనొప్పులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి కొంత మంది పార్టీని వీడే అవకాశాలున్నాయన్న ప్రచారానికి ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ నిరూపించారు. ఆయన కర్ణాటకలోని చించోలి నియజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గతకొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఉమేష్ జాదవ్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు.ఉమేష్ జాదవ్ బాటలోనే మరికొందరు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. రమేష్ జార్ఖిహోళి కూడా త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం కన్నడ నాట జరుగుతోంది. ఉమేష్ జాదవ్ కు కలబుర్గి పార్లమెంటు టిక్కెట్ ఇస్తామన్న ఒప్పందం కుదిరిందని, అందుకే ఆయన బీజేపీలో చేరేందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. ఆయన బుధవారం ప్రధాన మోదీ పర్యటన సందర్భంగా పార్టీలో అధికారికంగా చేరతారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్యే తగ్గినట్లే. ఉమేష్ జాదవ్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. జేడీఎస్,కాంగ్రెస్ ల మధ్య సీట్ల సర్దుబాటు కూడా తలనొప్పులు తెచ్చే విధంగా ఉన్నాయి. మాండ్య స్థానాన్ని అంబరీష్ సతీమణి సుమలత కోరుతున్నారు. సుమలత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే శివమొగ్గలో మధు బంగారప్పను ప్రకటించిన జనతాదళ్ ఎస్ తాజాగా మాండ్య నియోజకవర్గంలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ పేరును దాదాపుగా ప్రకటించింది. దేవెగౌడ మనుమలైన నిఖిల్ మాండ్య నుంచి, ప్రజ్వల్ హాసన్ నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చే్స్తున్నాయి.దేవెగౌడ మాత్రం బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించడం లేదు. బెంగళూరు ఉత్తరంతో పాటు బెంగుళూరు రూరల్ కూడా జేడీఎస్ కోరుతుంది. బెంగళూరు సిటీ పై పట్టు వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేవెగౌడ నేరుగా ఢిల్లీలో హైకమాండ్ తో భేటీ అయి ఆ స్థానాలపై హామీ పొంది వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయితే మరెంత మంది పార్టీ నుంచి జారుకుంటారోనన్న టెన్షన్ లో హస్తం పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సుమలత తమ పార్టీలోకి వస్తే మాండ్య సీటు ఇస్తామన్న సంకేతాలను పంపడం గమనార్హం