యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. అధికార భాజపా ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ పావులు కదుపుతున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్, జేడీఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. ఈ ఉదయం దిల్లీలోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న రాహుల్.. సీట్ల పంపకాలపై ఆయనతో మంతనాలు జరిపారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ జాతీయ కార్యదర్శి ధనిష్ అలీ కూడా పాల్గొన్నారు.కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 10 సీట్లను తమకు కేటాయించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కాంగ్రెస్‌ను కోరారు. ఈ మేరకు సీట్ల పంపకంపై దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బుధవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో సీట్ల పంపకంపై చర్చించామన్నారు. రెండు పార్టీల మధ్య ఈ విధమైన చర్చ జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. కర్ణాటకలోని 28 స్థానాలకు గానూ తమకు 12 సీట్లు కేటాయించాలని గతంలో కోరానని, రాహుల్‌తో జరిగిన తాజా సమావేశంలో 10 సీట్లను కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రాహుల్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేసీ వేణుగోపాల్, ధనిష్ అలీతో చర్చించాక మార్చి 10 నాటికి నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు.ఇదే సమావేశంలో దేశ ప్రస్తుత రాజకీయాలపైనా ఇద్దరం చర్చించామని దేవెగౌడ తెలిపారు. కర్ణాటకలో ఎన్నికల ముందు పొత్తు, విపక్షాల ఐక్యత తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. కర్ణాటకలో మూడింట రెండొంతుల స్థానాల్లో కాంగ్రెస్.. మిగిలిన చోట్ల జేడీఎస్ పోటీ చేస్తుందన్నారు.