యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తాను పుల్వామా ఘటనపై చేసిన వ్యాఖ్యలపై దమ్ముంటే కేసు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. దిగ్విజయ్ పుల్వామా దాడిని ఓ ప్రమాదంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్విజయ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు దిగ్విజయ్ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. పాక్ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. అలాంటి వారంతా దేశద్రేహులని అభిప్రాయపడ్డారు. దీనిపై దిగ్విజయ్ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘నేను ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు మీరు(మోదీ) మీ మంత్రులు నాపై దేశద్రోహం ముద్ర వేశారు. ఆ వ్యాఖ్యల్ని నేను దిల్లీ పోలీసుల పరిధిలో ఉండే ప్రాంతంలోనే చేశాను. మీకు ధైర్యముంటే నాపై దయచేసి కేసు నమోదు చేయండి’’ అంటూ ట్విటర్‌లో సవాల్ చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పుల్వామా ఘటనను ‘పెద్ద ప్రమాదం’గా వర్ణించిన ఓ వీడియోను దిగ్విజయ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మౌర్య వ్యాఖ్యలపై మోదీ, కేంద్ర మంత్రులు ఏం చెబుతారంటూ ప్రశ్నించారు. అలాగే పుల్వామా దాడి వెనక ఇంటెలిజెన్స్ లోపం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటివరకు మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
బాలాకోట్ దాడుల నేపథ్యంలో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికార, విపక్షాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రస్థావరాలపై జరిగిన దాడులకు ఆధారాలు చూపాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారపక్ష సభ్యులు.. భద్రతా బలగాల సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు శంకిస్తున్నాయని ఆరోపించారు. అలాగే పాక్ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇది దేశ ప్రతిష్ఠను దిగజారుస్తుందంటూ అభిప్రాయపడ్డారు. కాగా మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గణనీయ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని మాత్రమే భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు.