YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రిలో టీడీపీ బీసీ లెక్కలు

 రాజమండ్రిలో  టీడీపీ  బీసీ లెక్కలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వచ్చే ఎన్నికల్లో టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె, ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి భవానీ శ్రీనివాస్ ను రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఎర్రన్నాయుడు కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు, రామ్మోహన్ నాయుడు క్రేజ్ అన్నీ కలిసి భవానీ విజయం ఖాయమని టీడీపీ అంచనా వేస్తోంది. ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీడీపీ... మెరికల్లాంటి అభ్యర్ధుల కోసం అన్వేషణ సాగిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి అసెంబ్లీ స్ధానానికి పార్టీకి చెందిన దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ను రంగంలోకి దించబోతోంది. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్వయానా సోదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా అయిన భవానీని బరిలోకి దింపడం ద్వారా ఇక్కడి బీసీ ఓటర్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. ఆయన తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు కాగానే రాజమండ్రి అసెంబ్లీ సీటులో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు టికెట్ ఓకే చేశారు. మామ ఆదిరెడ్డి అప్పారావుకు నియోజకవర్గంలో ఉన్న పట్టు, మంత్రిగా చిన్నాన్న అచ్చెన్నాయుడు, ఎంపీగా సోదరుడు రామ్మోహన్ నాయుడు అండదండలు కూడా ఉండటంతో భవానీ ఇక్కడ గట్టి అభ్యర్ధి అవుతారని టీడీపీ అంచనా వేస్తోంది.బీసీ ఓటర్లు అధికంగా ఉన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ... ఈ మధ్యే జయహో బీసీ సభ కూడా నిర్వహించింది. బీసీలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీడీపీ... ఆయా వర్గాల కోసం ప్రత్యేక కార్పోరేషన్లు ప్రకటించడంతో పాటు సబ్ ప్లాన్ కూడా అమలు చేస్తోంది. ఇవన్నీ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తమకు కలిసొస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె అయిన భవానీకి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో లోకేష్ టీమ్ తయారీకి పనికొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు రామ్మోహన్ నాయుడుకు పార్టీలోని యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈసారి భవానీ కూడా గెలిస్తే టీడీపీలోనూ ఆమె కీలకం కానున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోనూ భవానీ శ్రీనివాస్ పైనే అందరి దృష్టీ నెలకొంది.

Related Posts