యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మరోసారి రాజధాని అమరావతి మళ్లీ హాట్ టాపిక్ గా మారనుంది. ఎన్నికల సమయానికి తిరిగి రాజధాని అంశం చర్చనీయాంశమవుతుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లోని అధికార, విపక్షాలు రాజధాని అమరావతి చుట్టూ ప్రచారాన్ని సాగిస్తుండటం విశేషం. 2014 ఎన్నికల్లోనూ రాజధాని అంశమే ప్రధాన అంశంగా మారింది. అప్పటికి రాజధాని ఎక్కడో తెలియకపోయినా తెలుగుదేశం మాత్రం జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని ఇడుపులపాయలో నిర్మిస్తారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బాగా ప్రచారం చేయగలిగింది.రాజధాని నిర్మాణంలో అప్పట్లో వైసీపీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయిందన్న విమర్శలూ నేటికీ ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తాము వస్తే మరో సింగపూర్ ను చేస్తామని, అద్భుతమైన నగరాన్ని కట్టి చూపిస్తామని హామీలు ఇచ్చింది. దీంతో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి రాజధాని కూడా ఒక కారణమయిందని చెప్పొచ్చు. అయితే నాలుగున్నరేళ్లుగా రాజధాని నిర్మాణం ఏమాత్రం జరగలేదు. అమరావతిలో అంతా తాత్కాలిక భవనాలు నిర్మించి తెలుగుదేశం ప్రభుత్వం మ..మ అనిపించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాజధాని నిర్మాణం వేగంగా చేపట్టలేదన్న విమర్శలూ టీడీపీపై ఉన్నాయి.ఎన్నికల సమయం ముంచుకురావడంతో రాజధాని నిర్మాణం మరోసారి ప్రజల ముందుకు వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరోసారి వైసీపీపై దాడికి దిగుతుంది. జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం చేయరన్న ప్రచారం జోరుగా చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతి గురించి మ్యానిఫేస్టోలో పెడతామని చెప్పడాన్ని కూడా టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంది. నాలుగున్నరేళ్ల క్రితం ఖరారయిన రాజధాని గురించి ఇప్పుడు మ్యానిఫేస్టోలో పెట్టడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఒక ఆయుధంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోంది.రాజధాని నిర్మాణం అమరావతిలో ప్రారంభం కావడంతో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చేందుకు వీలులేదు. అది అందరికీ తెలిసిందే. అయినా ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. అయితే దీన్ని తిప్పికొట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమయిందనే చెప్పాలి. సాక్షాత్తూ వైఎస్ జగన్ కూడా రాజధాని అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అస్పష్టతగా ఉండటం జగన్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా. రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటి వరకూ టీడీపీ ఏమీ చేయలేకపోవడాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ ఈ విషయంలో దూకుడుగా ఉండకపోవడం చేటు తెచ్చే విషయమేనన్నది పరిశీలకుల భావన. మళ్లీ ఎన్నికలకు ముందు రాజధాని అంశం మరోసారి తెరపైకి రావడంతో ఎవరు ప్రజలకు నమ్మకం కల్గిస్తారన్నది వేచి చూడాలి.