యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతల కష్టాలు తప్పడం లేదు. రైతులు అవసరాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలను ఆసరాగా చేసుకున్న దళారులు, వ్యాపారులు శనగలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి అనేక నిబంధనాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.రబీలో పండించిన శనగలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాఫెడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వంతో ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,620గా ప్రకటించింది. కానీ సవాలక్ష నిబంధనలు పెట్టారు. ప్రతి రైతు నుంచి ఎకరానికి 5 క్వింటాళ్ల చొప్పున 20 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకు మించి కొనుగోలు చేయమని తేల్చి చెప్పారు. వ్యవసాయ శాఖ మాత్రం ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని అంచనా వేస్తోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు, మరికొన్ని ప్రాంతాల్లో 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తోందని రైతులంటున్నారు. దీంతో రైతుల నుంచి పూర్తిస్థాయిలో శనగలు కొనే పరిస్థితి లేదు.జిల్లాలో మార్కెట్ కమిటీ నిజామాబాద్, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు బోధన్, సాలూర, కల్దుర్కి, హున్సా, పోతంగల్, రెంజల్, నీలా, జాకోరాలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. ఫిబ్రవరి 22న కేంద్రాలు ప్రారంభించి తొలి విడతలో ఒక్కొక్క కేంద్రానికి నాలుగు వేల క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొన్ని మినహా చాలా సొసైటీల్లో టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేశారు. నిజామాబాద్, బోధన్ కేంద్రాలకు అదనంగా 500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. జాకోరా (వర్ని మండలం)కేంద్రంలో ఇప్పటి వరకు కొనుగోళ్లు నమోదు కాలేదు. కొన్ని కేంద్రాల్లో ప్రారంభించిన నాలుగైదు రోజుల్లో లక్ష్యం పూర్తయింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేశారు. సాలూర, హున్సా, కల్దుర్కి కేంద్రాల్లో విక్రయానికి తీసుకొచ్చిన శనగ కుప్పల వద్ద రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. నాలుగు వేల క్వింటాళ్ల శనగ కొనుగోళ్లకు సోసైటీలకు అనుమతి ఇచ్చారు. తొలి విడత టార్గెట్ పూర్తి చేసిన కేంద్రాల్లో కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించారు. దిగుబడితో పోల్చుకుంటే రెండో విడత కొనుగోళ్లు కూడా కొన్ని సొసైటీల్లో మరో రెండు రోజుల్లో అయిపోయే పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు