యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ తమపై కేసులు పెట్టిస్తున్నారని, తమ డేటా దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పుపట్టారు. వైకాపా నుంచి ఫోన్లు చేసేవారిని నిలదీయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. తమ నెంబర్ ఎవరిచ్చారని వారిని ప్రశ్నించాలని సూచించారు. తెదేపా డేటా ఎందుకు చోరీ చేశారని నిగ్గదీయాలని, దొంగలకు ఓట్లు ఎందుకు వేస్తామని ధైర్యంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్ లు ఉన్నాయని, కానీ తెదేపా యాప్ పై దుష్ప్రచారానికి తెగబడ్డారని దుయ్యబట్టారు.
ఏపీపై వైకాపా, తెరాస, భాజపా కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక ఆ మూడు పార్టీ కుట్ర ఉందన్నారు. ఫారం-7 దుర్వినియోగం చేశానని జగనే చెప్పారని, తొలిదశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారని సీఎం ఆరోపించారు. 2 వేల మంది వైకాపా వాళ్లే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని, 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనేనని ఆయన స్పష్టంచేశారు. సకాలంలో వేగంగా స్పందించి, ఈ కుట్రలను అడ్డుకున్నామని సీఎం తెలిపారు.
డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.3,500
డ్వాక్రా మహిళలు అందరికీ ఈ రోజు మరో శుభదినమని సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ కింద రెండో విడత చెల్లింపులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మహిళ ఖాతాలో ఈరోజే రూ.3,500 జమ అవుతాయని, రేపు మహిళా దినోత్సవం రోజే అందరికీ నగదు అందనుందన్నారు. మహిళలకు మరో కిస్తీ రూ.4వేలు త్వరలోనే చెల్లిస్తామని ప్రకటించారు.