యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పుల్వామా ఉగ్రదాడిని మరవకముందే జమ్మూకశ్మీర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. జమ్మూ బస్టాండ్‌లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణింగా పలువురు గాయాలపాలయ్యారు. స్థానిక జనరల్ బస్టాండ్‌లోని నిలిపి ఉంచిన ఓ బస్సులో ఈ పేలుడు సంభవించింది. బస్సు కింద అమర్చిన గ్రనేడ్ పేలి.. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఆందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో 28 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బస్టాండ్‌ను తమ అధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే గత 10నెల్లలో ఇలాంటి దాడి జరగడం ఇది మూడోసారని పోలీసులు వెల్లడించారు. గ్రనేడ్ తీవ్రత తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని జమ్మూ ఐజీపీ ఎంకే సిన్హా తెలిపారు.