యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షపార్టీ వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఒకవైపు కీలకనేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్.. మరోవైపు సినీ గ్లామర్‌ను పొలిటికల్‌గా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాగార్జున, సుమంత్, మంచు విష్ణు, మోహన్ బాబు, తదితరులు జగన్‌కి టచ్‌లో ఉండగా.. కమెడియన్ పృథ్వీ వైసీపీ కండువా కప్పుకుని కీలకపదవిని రాబట్టారు. ఇక పోసాని, భాను చందర్, విజయ్ చందర్, చోటా కె నాయుడు తదితరులు వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా సీనియర్ నటి జయసుధ వైసీపీ పార్టీలో చేరనున్నారు. గురువారం సాయంత్రం పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు రాజకీయ వర్గాల నుండి సమాచారం. అయితే సహజనటిగా పేరొందిన జయసుధకు ఏపీలోనూ మంచి ప్రజాధరణ ఉండటంతో కీలకమైన విజయవాడ లేదా విశాఖపట్నంలోని ఒక స్థానంలో పోటీ చేస్తారని సమాచారం. 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన జయసుధ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. అయితే జయసుధ టీడీపీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తన సహ నటుడు మురళీమోహన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జయసుధను టీడీపీలో జాయిన్ చేయించారనే ప్రచారం అప్పట్లో నడిచింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరం కావడంతో జయసుధ కూడా పార్టీని వీడుతున్నారా? లేక పార్టీలో సరైన గుర్తుంపు లేకపోవడంతో కండువా మారుస్తున్నారా అన్నది తేలాల్సిఉంది. మొత్తానికి అప్పట్లో కాంగ్రెస్ కండువా.. తరువాత టీడీపీ కండువా.. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు జయసుధ.