యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాఫెల్ యుద్ద విమానాలు కొనుగోలుకు సంబంధించిన రహస్య పత్రాలు చోరీకి గురైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాఫెల్ ఫైల్స్ మిస్సైన అంశంలో మీడియాను కూడా విచారించాలని ప్రభుత్వం అంటోందని, కానీ ఆ డీల్‌లో 30 వేల కోట్లు చోరీ చేసిన వ్యక్తిని కూడా విచారించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఆ అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. రహస్య పత్రాల్లో ఉన్న వ్యక్తులను కూడా విచారించాలన్నారు. మోదీని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ ఒప్పందాన్ని రూటు మార్చేందుకు మోదీ బైపాస్ సర్జరీ చేశారని ఆ రహస్య పత్రాల్లో ఉందని, మరి ఆ పత్రాల ప్రకారం మోదీని కూడా దర్యాప్తు చేయాలన్నారు. పత్రాలను మాయం చేయడమే మోదీ సర్కారు పని అని రాహుల్ అన్నారు. రాఫెల్ డీల్‌లో మోదీ సమాంతరంగా చర్చలు నిర్వహించారని గల్లంతు అయిన పత్రాలు ఉన్నట్లు చెప్పారు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే.. రాఫెల్ విమానాల అప్పగింత ఆలస్యంగా మారుతోందని రాహుల్ అన్నారు. మోదీ దారుణమైన అవినీతికి పాల్పడ్డారని, సమాంతర డీల్ జరిపిన మోదీపై క్రిమినల్ విచారణ ఎందుకు చేపట్టరన్నారు. మోదీని వ్యతిరేకిస్తున్న వారిపైనే దర్యాప్తు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఒకవేళ ఈ డీల్‌లో మోదీ తప్పులేకుంటే, మరెందుకు ఆయన విచారణకు హాజరకావడం లేదన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. మీడియా ధైర్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టే, వారిని విచారించాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తోందర్నారు. మోదీకి వ్యతిరేకంగా నిలబడే సత్తా మీడియాకు ఉందన్నారు.