యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, బహిష్కృత నేత శివకుమార్ అధినేత వైఎస్ జగన్‌తో రాజీకొచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు. పార్టీలో నెలకొన్న వివాదానికి స్వస్తి చెప్పి.. తనపై బహిష్కరణను ఎత్తివేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన శివకుమార్ తన జీవితంలో ఈ రోజు ఒక శుభదినమన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో తాను పనిచేసినా.. కొన్ని ఇబ్బందులతో పార్టీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. జగన్ పెద్ద మనసుతో తనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ లైన్.. తన లైన్ వేరేలా ఉందనే పార్టీ నుంచి తొలగించారని చెప్పుకొచ్చారు శివకుమార్.జగన్‌తో పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను మాట్లాడానని.. పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని జీర్ణించుకోలేక.. టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ అధకారంలోకి రావడం ఖాయమన్నారు. దేశ ప్రధాని నిర్ణయించేది జగన్‌మోహన్ రెడ్డినని ధీమా వ్యక్తం చేశారు శివకుమార్. తెలంగాణ ఎన్నికల సమయంలో వైఎస్ దుర్మార్గుడని కేసీఆర్ విమర్శించడంతో.. టీఆర్‌ఎస్‌కు ఓటేయొద్దని శివకుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ మరణించే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందున.. ఆ పార్టీకి ఓటేయాలని ప్రతికా ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ నుంచి శివ కుమార్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తూ ఆ పార్టీ పత్రికా ప్రకటన జారీ చేసింది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. జగన్‌కు తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, పార్టీ తనదేనని వాదించారు. పార్టీ వ్యవస్థాపక నిబంధనలను జగన్ పక్కన పెట్టారని శివకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీని తిరిగి తనకు అప్పగించాలని కోరారు. శివకుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీచేసింది. మార్చి 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు పార్టీ సీనియర్ నేతలు శివకుమార్‌తో చర్చించారు. బహిష్కరణను కూడా ఎత్తివేయడంతో.. ఈ వివాదం అంతటితో సమసిపోయింది. శివకుమార్ కూడా జగన్‌ను కలవడంతో.. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడింది.తెలంగాణకు చెందిన శివకుమార్ వైసీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)ని 2009లో ఏర్పాటు చేశారు. తన తండ్రి పేరు కలిసి వస్తుండటంతో.. ఆ పార్టీని జగన్ తన అధీనంలోకి తెచ్చుకున్నారు. వైఎస్ జగన్ అధ్యక్షుడిగా.. ఆయన తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. శివకుమార్‌ను పార్టీ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు.