యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జిల్లాలోని పరిశ్రమల నుంచి వ్యర్థాలు, పట్టణాలు, గ్రామాల నుంచి మురుగునీరు సరాసరి గోదావరి, కాలువల్లోకి వదిలేస్తుండటంతో జల కాలుష్యంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరవుతోంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 29 మండలాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేది గోదావరి జలాలే. జిల్లాలో దాదాపు రెండువేల కిలోమీటర్ల మేర కాలువలు ప్రవహిస్తుండగా.. వీటిలో కలవని వ్యర్థ పదార్థం లేదు. పదకొండు ప్రధాన కాలువల ద్వారా సగానికిపైగా డెల్టా ప్రజలకు తాగునీరు అందుతుంది. వీటికి అనుబంధంగా వందలాది పిల్ల కాలువలు ఉండగా.. అవన్నీ కలుషితమవుతూ జలం గరళంగా మారుతోంది.
గోదావరి నది, కాలువల్లోకి వ్యర్థాలను ఇష్టారాజ్యంగా వదిలేస్తుండటంతో జలం కలుషితం అవుతోంది. నీరు గరళంగా మారి ఆ నీటిని తాగిన వారు రుగ్మతల బారిన పడుతున్నారు. గోదావరి ప్రధాన కాలువల్లోని కాలుష్య కారకాలపై గతంలో సర్వే చేపట్టారు. కాలువల్లో మురుగునీరు కలుస్తున్న ప్రాంతాలు సుమారు 6500 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తణుకు పట్టణ పరిధిలోని జీఅండ్‌వీ కాలువలోకి దాదాపు 30 ప్రాంతాల్లో మురుగు వదులుతున్నట్లు తేల్చారు. తణుకులో 14 పరిశ్రమల నుంచి భారీగా వ్యర్థ జలం సత్యవాడ డ్రెయిన్లో కలుస్తోంది. ఆ కలుషితనీరు గోస్తనీ ద్వారా యనమదుర్రు డ్రెయిన్‌లోకి చేరుతోంది. ప్రధానంగా రసాయన, డిస్టిలరీ, స్పిన్నింగ్, ప్లాస్టిక్, ఆయిల్, పేపర్, అట్టలు, సిరామిక్ టైల్స్, చేపలు, రొయ్యలు, కొబ్బరి పరిశ్రమలు, ధాన్యం మిల్లుల నుంచి వ్యర్థాలు చేరుతున్నాయి.
భీమవరం పట్టణం నుంచి 13 మిలియన్ లీటర్ల మురుగునీరు యనమదుర్రు డ్రెయిన్‌లోకి చేరుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధరించారు. నిడదవోలు, తాడేపల్లి గూడెం పట్టణాల్లోనూ మురుగుకాలువల్లో కలుస్తుంది. ప్రధానకాలువ పరిధిలో సుమారు 30 వరకు మురుగునీరు కలిసే ప్రాంతాలున్నాయి. విజ్జేశ్వరం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువ శెట్టిపేట వరకు ప్రవహిస్తోంది. దీని పరిధిలో హెడ్ స్లూయిస్‌కు సమీపంలోని సీˆతంపేట వద్దే నాలుగు నుంచి ఐదు వరకు మురుగునీరు కలిసే ప్రాంతాలున్నాయి. ఇంకా గోపవరం, సమిశ్ర గూడెంలకు చెందిన మురుగునీరు ఈ కాలువలోనే కలుస్తుంది. తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాల్లోని కలుషిత నీరు పేముల కాలువ ద్వారా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి చేరుతుంది. ఒక్కోసారి పరిశ్రమల నుంచి మొలాసిస్‌ను విడుదల చేస్తున్నారు. పాలకొల్లు ప్రాంతంలో నక్కల, కాజ, భగ్గేశ్వరం, గొంతేరు, పాలకొల్లు, దమ్మయ్యపర్తి వంటి మురుగు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువల పొడవునా విస్తరించి ఉన్న రొయ్యల చెరువుల వ్యర్థపు నీటిని డ్రెయిన్లలోకి వదులుతుంటారు.
ఏటా గోదావరి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నీరు 200 టీఎంసీల నుంచి 220 టీఎంసీల వరకే ఉంటుంది. కానీ గోదావరికి వచ్చి చేరుతున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేనందున ఏటా 2500 టీఎంసీల నుంచి 3000 టీఎంసీల వృథా అవుతోంది. వర్షాలు తగ్గడంతో నదులు, చెరువుల వంటి ఉపరితల జల వనరులు వట్టిపోవడం ప్రధాన సమస్య అయితే భూగర్భ జలవనరులు అడుగంటడం మరో సమస్య. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల వరకు చెరువులు ఆక్రమణకు గురై ఉంటాయనేది అంచనా. గతంలో చెరువులు పూర్తిగా ఉండటంతో మెట్ట ప్రాంతంలో వర్షాలు కురిసిన సమయంలో నీరు చెరువుల్లోకి చేరి భూమిలోకి ఇంకేది. బోర్ల నుంచి నీరు బాగా వచ్చేది. ప్రస్తుతం చెరువులు ఆక్రమణకు గురికావడంతో నీటి నిల్వ సామర్థ్యం లేక బోర్లు కూడా అడుగంటిపోతున్నాయి. వరి పంటకు ఒక క్యూసెక్కు నీటిని 70 ఎకరాలకు అందించాల్సి ఉండగా.. నీటి కొరతతో ఒక క్యూసెక్కు నీటిని 120 నుంచి 130 ఎకరాల వరకు వినియోగించాల్సి వస్తోంది. మనిషికి రోజుకు 130 లీటర్ల వరకు అందించాల్సి ఉంది. కానీ సగటున 70 లీటర్లు కూడా అందించలేని పరిస్థితి ఉంది.