Highlights
- నిరుద్యోగులకు ప్రతినెల రూ.2వేల భృతి
- కసరత్తు చేపట్టిన ఆర్థికశాఖ
- త్వరలోనే ప్రకటన చేయనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో భారీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రతినెల నిరుద్యోగులకు రూ.2వేల భృతిని ప్రకటించనుంది. ఇందుకోసం అవలంబించనున్న విధివిధానాలపై ఆర్థికశాఖ కసరత్తు చేపట్టింది. ప్రతినెలా ఫించన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనే కేటాయింపులు ఉండేలా ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు.
ఉద్యమ సమయంలో అండగా ఉన్న నిరుద్యోగులు అనుకున్న విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. అందుకే అందరికీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కొత్త వ్యూహం పన్నింది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఆలోచనకు గండికొట్టేలా ఈ ఏడాది నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలనే నిర్ణయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ నెలా పెన్షన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బు జమయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు ఎవరిని నిరుద్యోగులుగా పరిగణించాలి, ఎంత మందికి భృతి అందించాలనే అంశంపైన విధివిధానాల రూప కల్పనకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యపై లెక్కలు తేల్చడం కోసం సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు. మొత్తం 15 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి అందించాలనేది కేసీఆర్ ఆలోచన ఆ లెక్కన నెలకు రూ.300కోట్ల చెప్పున ఏడాదికి రూ.3600 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. అయితే కాలేజీ యాజమాన్యాల జేబులు నింపే ఫీజురీయింబర్స్‌మెంట్‌లాంటి పథకాలను అమలు చేసే బదులు నిరుద్యోగులకు జీవన భృతి కల్పించడమే మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.