యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వచ్చే ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు పార్టీ శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానానికి తొలి అభ్యర్థిని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఖరారు చేశారు. మడకశిర మండలం హరేసముద్రం గ్రామానికి చెందిన న్యాయవాది అశ్వర్థనారాయణ ఖరారు చేశారు. తద్వారా రాష్ట్రంలో అభ్యర్థుల పేర్ల ప్రకటనకు శ్రీకారం చుట్టారు. మడకశిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా కల్యాణదుర్గం నుంచి సెల్‌ఫోన్‌లో అభ్యర్థి పేరు ప్రకటించడం విశేషం. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ అనారోగ్య కారణాల వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో న్యాయవాది అశ్వర్ధనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు కానున్నాయని, ఈ నెల 15లోగా జాబితా విడుదల చేయనున్నట్లు రఘువీరా తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటారని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై రఘువీరా విరుచుకుపడుతూ ప్రాంతీయ పార్టీలతో వచ్చిన సమస్యే ఇది అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నాయని, వీరికి వ్యవస్థ, ప్రజల మీద నమ్మకం లేదని, రెండు పార్టీలూ దొందూదొందేనని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలాగూ ప్రజలు బహిష్కరిస్తారని, అదే విధంగా ప్రాంతీయ పార్టీలను కూడా బహిష్కరించాలని అన్నారు. ప్రతిపక్షాలు తనను అంతమొందించాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించడంపై స్పందిస్తూ ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని రఘువీరా అన్నారు.