యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అష్టకష్టాలు పడుతుంటే… విభజన హామీలు అమలు చేయక భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ సీన్ ను ఏపీలో చూడాల్సి వస్తోంది. వచ్చే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు పార్లమెంటు స్థానాలకే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. పది పార్లమెంటు స్థానాలకు మించి అభ్యర్థులు కమలం పార్టీకి దొరకడం కష్టంగా మారింది. ఇక శాసనసభ నియోజకవర్గాల పరిస్థితిని చూస్తే మరీ కడుపు తరుక్కుపోతోంది. కేవలం పది స్థానాలకు మాత్రమే కమలం పార్టీలో అభ్యర్థులు కనపడుతున్నారు.గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో పొత్తు ఉండటంతో రెండు పార్లమెంటు స్థానాలను, నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీ సునాయాసంగా గెలుచుకుంది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. 175 శాసనసభ నియజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పార్టీ తరుపున బరిలోకి దింపాల్సి ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కన్నా ప్రణాళిక రూపొందించుకున్నారు.ప్రస్తుతం 25 పార్లమెంటు స్థానాలకు సరైన అభ్యర్థులను ఖరారు చేయడమే కన్నా ముందున్న లక్ష్యం. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు తొలుత 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. అయితే పార్లమెంటుకు పోటీ చేసేందుకు సీనియర్ నేతలు సయితం ఉత్సాహం చూపడం లేదు. గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ ఎంపీ కంభం పాటి హరిబాబు సయితం పోటీకి విముఖత చూపుతున్నారు. అలాగే నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన గోకరాజు గంగరాజు సయితం పోటీకి తాను సిద్ధంగా లేరనిచెప్పారట. దీంతో అక్కడ అభ్యర్థులు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాల కన్వీనర్లతో రెండుసార్లు సమావేశం నిర్వహించారు. మోదీ గుంటూరు, విశాఖ సభల ద్వారా క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన కూడా బీజేపీకి కలసి వచ్చేట్లు లేదు. దీంతో కన్నా ఈసారి తమ పార్టీ తరుపున అన్ని సామాజిక వర్గాల వారీకి టిక్కెట్లు ఇస్తామని చెబుతున్నారు. టీడీపీ ఓట్లను చీల్చే లక్ష్యంగా అభ్యర్థులను కన్నాలక్ష్మీనారాయణ ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈనెలాఖరులోపు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు అవుతారని కన్నా చెబుతున్నారు. కన్నా ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ బీజేపీకి ఏపీలో అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది