యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ కు ఈసారి టిక్కెట్ దక్కుతుందా? ఆయన స్థానంలో మరొకరు కాచుక్కూర్చుని ఉన్నారా? శివప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకుంటే ఆయన రియాక్షన్ ఏంటి? ఒకవైపు శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ కు రైల్వే కోడూరు టిక్కెట్ ను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. దీంతో ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా ఉన్న శివప్రసాద్ కు మరోసారి అవకాశమిస్తారా? లేక తనకు ఇష్టుడైన వారిని ఆ సీట్లో చంద్రబాబు కూర్చోబెడతారా? అన్న చర్చ జరుగుతోంది. శివప్రసాద్ కు కూడా ఇవే రకమైన సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఆయన ఎటూ తేల్చేకోలేక సతమతమవుతున్నారు.చిత్తూరు పార్లమెంటు స్థానం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు. 1996 నుంచి జరిగిన ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటి వరకూ ఆరుసార్లు తెలుగుదేశం పార్టీయే గెలిచింది. దీంతో ఈ సీటు ఆశావహుల కన్ను ఉంటుందని చెప్పనవసరం లేదు. చిత్తూరు వరస విజయాలకు కూడా కారణాలు లేకపోలేదు. శివప్రసాద్ 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. రెండుసార్లు గెలవడానికి కారణం కూడా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గమేనని చెప్పక తప్పదు.చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పూతలపట్టు, పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి, చంద్రగిరి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్టీ సెగ్మెంట్లలో ఐదు అసెంబ్లీ స్థానాలైన చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుల్లో వైసీపీ గెలిచినా ఎంపీగా శివప్రసాద్ విజయం వెనక కుప్పం ఉంది. చిత్తూరు , కుప్పం స్థానాల్లోనే టీడీపీ విజయం సాధించింది. కుప్పంలో చంద్రబాబుకు యాభై ఐదు వేల మెజారిటీ రావడంతోనే శివప్రసాద్ నలభై ఐదు వేల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఆ ఎన్నికల్లో అప్పట్లో కాంగ్రెస్ నాలుగు, టీడీపీ మూడు చోట్ల విజయం సాధించినా కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన 45 వేల మెజారిటీ కారణంగా శివప్రసాద్ పదివేలతో బయటపడ్డారు. అంటే ఒకరకంగా చిత్తూరు ఎంపీ విజయం వెనక చంద్రబాబు మెజారిటీ ఉందని చెప్పక తప్పదు.శివప్రసాద్ గత పదేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నారు. 2009 రాష్ట్ర విభజన సమయంలోనూ, 2014 నుంచి ఇప్పటి వరకూ విభజన హామీల అమలు కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. అందులో ఏమాత్రం సందేహంలేదు. రోజుకో వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. దళితులకు టీడీపీలో సరైన గుర్తింపు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అలాగే కొన్ని భూకబ్జాల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ ఆవుల దామోదరం పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ఈయన కూడాచంద్రబాబుకు సన్నిహితుడు. వైస్ ఛాన్సిలర్ గా రిటైర్ అయ్యాక దామోదరంకు చంద్రబాబు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలను అప్పగించారు. బాబు కోర్ టీంలో సభ్యుడయ్యారు. దామోదరం చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన పేరును కూడాచంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే శివప్రసాద్ టిక్కెట్ గల్లంతవ్వడం ఖాయమంటున్నారు