యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతోన్న అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు వివాదానికి మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం కనుక్కోవడం సులభమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో శుక్రవారం తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం, అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల నియామకమే మేలైనదని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో జస్టిస్ ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచ్లు సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. వారంలో రోజుల్లోనే ఈ కమిటీ తన పనిని ప్రారంభించాలని, ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. ఒకవేళ అవసరమైతే మరి కొందర్ని కమిటీలో చేర్చుకునే వెసులుబాటు కల్పించింది. మధ్యవర్తిత్వం కమిటీ అవసరమైన అన్ని సౌకర్యాలనూ ఫైజాబాద్లో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలని ఆదేశించింది. మధ్యవర్తులు అవసరమైతే న్యాయ సహాయం కూడా తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ కోర్టు పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా సాగుతుందని జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. అంతేకాదు, మధ్వవర్తిత్వం ప్రక్రియను మీడియాకు వెల్లడించడం కూడా కుదరదని ఆదేశాలు జారీచేసింది. అలాగే, మరో నాలుగు వారాల్లో పిటిషనర్లు, వాద ప్రతివాదులతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియను మొత్తాన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది. కాగా, అయోధ్యలోని వివాదాస్పన 2.7 ఎకరాల భూమి తమదేనంటూ హిందూ, ముస్లిం సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి.