యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చురేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే తమలపాకుతో నువ్వెకటి ఇస్తే, తలుపు చెక్కతో నే రెండిస్తా అన్న రీతిలో ఏపీ ప్రభుత్వం ఏకంగా రెండు సిట్లను ఏర్పాటు చేయడం గమనార్హం. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండగా దీనికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా, ఈ వ్యవహారంలో టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈ మూడు పార్టీలూ కుట్రలు పన్నుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధికి గండికొట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి అధ్యక్షుడు కేసీఆరేనని, టీఆర్ఎస్-వైసీపీలకు సంయుక్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్కు డమ్మీగా మార్చేశారని సీఎం దుయ్యబట్టారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్ కుటుంబం ఉందని, దీనికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్తో జగన్కు దోస్తీ ఏంటని నిలదీశారు. ముందు కేసీఆర్ పెట్టుబడి పెడితే, తర్వాత జగన్ కప్పం కడతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నిస్సిగ్గుగా దొంగ పనులు చేస్తోందని, టీఆర్ఎస్ కు డబ్బులు బాగా చేరాయని, అందుకే జగన్ కు కేసీఆర్ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారని సీఎం విమర్శించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించే బీజేపీ కుట్రలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ డేటా చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామని తెలిపారు. ఈ 10 రోజుల్లోనే రాష్ట్రానికి రూ.45వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రతిష్ఠ కోసం తాను కష్టపడుతుంటే, అప్రతిష్ఠపాలు చేయడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని దుమ్మెత్తిపోశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం పెంచామని పేర్కొన్నారు. ప్రతి డ్వాక్రా మహిళ ఖాతాలో ఈ రోజే రూ.3,500 జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, బోగస్ చెక్కులన్న వైసీపీకి మహిళలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే మూడు రోజులు అన్నిచోట్లా ర్యాలీలు, సభలు నిర్వహించాలని, దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలని సీఎం సూచించారు.