యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబుని డాటా బాబా అని, ఆయన కుమారుడు బేటా బాబా అని ఎద్దేవా చేశారు.అనంతపురం శివారులో శుక్రవారం నిర్వహించిన "డ్వాక్రా ఢమరుకం" సభలో రోజా ప్రసంగించారు. టీడీపీ రాక్షస పాలనలో మహిళలను రక్షణలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. మంత్రిస్థానంలో ఉండి పరిటాల సునీత మహిళలను వేధించడం దుర్మార్గమన్నారు. రాప్తాడులో కుటుంబ పాలన జరగుతోందని, పరిటాల వర్గీయులు హింసా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల మంగళసూత్రాలు తెగిపడుతున్నా మంత్రులు సునీత, అఖిలప్రియ స్పందించకపోవడం దారుణమన్నారు. మహిళల వేదింపుల్లో ఏపీని నెంబర్వన్గా నిలిపిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు చెక్కులతో మోసం చేస్తున్నారని, వైఎస్ జగన్కు ఆడపడుచులు అండగా నిలవాలని రోజా కోరారు.
అంతకుముందు రోజా మీడియాతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, లోకేశ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితా దొంగిలించిన నేరం కింద.. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలని కోరారు.