యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై ఆసక్తిని పెంచిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఆది సాయికుమార్ కథానాయకుడిగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి విశేష స్పందన లభిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దగ్గుబాటి రానా విడుదల చేయగా... ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్ ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్... సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంత మంది ప్రముఖుల మద్దతు ఇవ్వడంతో చిత్రానికి అదనపు బలం చేకూరింది.
ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్ లుక్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి ఆహార్యం ప్రచార చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే... ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు పాడిన పాట. సినిమాలో ఓ పాటను ఆయన ఆలపించారు.
ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ "ఈ పాట చిత్రంలోని కీలక సన్నివేశంలో వస్తుంది. చిత్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళింది. సినిమా స్థాయి పెరిగింది. ఈ పాటకు రామజోగ్గయ్య శాస్త్రి గారు అద్భుతమైన, విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు. దేశభక్తిని పెంచే ఒక గేయాన్ని పెద్ద సింగర్ పాడాలి అనుకుని కీరవాణి గారిని అడగడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే కాదు అనకుండా ఈ పాట పాడడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు" అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ "పాట చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు అందరినీ భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ చాలా బాగా ఇచ్చారు. కీరవాణి గారు మా విన్నపాన్ని మన్నించి పాడారు. ఆయనకు థాంక్స్. ఆయన పాడటంతో పాట స్థాయి పెరిగింది. ఈ పాట నుంచి సినిమా కొత్త మలుపు తీసుకుంటుంది. జనాన్ని ఆలోచింపచేస్తుంది. ఈ పాటలో ఒక సందేశం ఉంటుంది. కీరవాణి గారు పాట విని... 'చాలా బాగుంది, చేద్దాం' అన్నారు. ఆయన సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ టు కీరవాణి గారు. కీరవాణి గారి గానం పాటకి ఇంకా బలాన్ని చేకూర్చింది" అన్నారు.
చిత్ర బృందం మాట్లాడుతూ "అడిగిన వెంటనే కాదు అనకుండా పాట పాడడానికి అంగీకరించిన కీరవాణి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాటని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని తెలిపింది. ఈ చిత్రం లో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, శషా చెత్త్రి , నిత్యా నరేష్, కేరింత నూకరాజు, కార్తీక్ రాజు, మనోజ్ నందం, కృష్ణుడు, అనీష్ కురువిళ్ళ, రావు రమేష్, హేమంత్ ముఖ్య పాత్రలలో నటించారు.