యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిస్వార్థంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్తోనే సాధ్యమని అన్నారు. లోటస్పాండ్లో శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేశారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఒడిదుడుకులు భరించలేకనే వైఎస్సార్సీపీలో చేరానన్నారు. వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని ప్రశంసించారు. ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాయమాటలకు దూరంగా వచ్చినట్టు చెప్పారు.
వైఎస్సార్, ఎన్టీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో తాను పెద్ద పదవులు అనుభవించలేదని చెప్పారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. తనకు పెద్ద పదవి ఇస్తానని మూడుసార్లు చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడతానని.. కల్మషం, కపటం లేకుండా పనిచేస్తానని అన్నారు. కర్నూలులో వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తానని, చల్లా మాట ఇస్తే తిరుగేలేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.