కృష్ణాజిల్లా :
ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. 22 నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పరిసరాల పరిశుభ్రతను అమలు చేసేందుకు ప్రభుత్వం గౌరవ వేతనంతో 2016లో వారిని నియమించింది. ఏడాది తర్వాత జీతాలు చెల్లించాలని ఆందోళన చేయగా మొదటి నాలుగు నెలలకు మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకూ వేతనాలు అందుకోలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా ఉందని, బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని పలు మార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం శూన్యం. జడ్పీ పాఠశాలల్లో పనిచేసే వారికి నెలకు రూ.4వేలు, ప్రాథమికోన్నతలో రూ.2,500, ప్రాథమిక పాఠశాలల్లో రూ.2వేలు చొప్పున గౌరవ వేతనం సర్వశిక్షా అభియాన్ ద్వారా చెల్లిస్తున్నారు. వారి సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు అధికంగా ఉన్నాయి.
పాఠశాల ప్రారంభానికి ముందు గదులు చిమ్మడం, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచడం వారి బాధ్యత. దాదాపు రెండేళ్లుగా వేతనాలు నిలిచిపోయినప్పటికీ ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు వేతనాలు ఆలస్యమైతే ఇబ్బందిపడుతున్నామంటూ ఉద్యోగులు పెదవి విరుస్తుంటారు. కానీ మాకు 22 నెలలుగా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోరుచుట్టుపై రోగలి పోటు తరహాలో జీతాలు చెల్లించకపోగా చీపుర్లు, ఫినాయిల్, ప్లాస్టిక్ చెత్త బుట్టలు కూడా వారే సమకూర్చుకోవాల్సి వస్తుందడంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
కృష్ణా జిల్లాలో దాదాపు 3,600 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 60 శాతం పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో సెర్ప్ ద్వారానే కొంతకాలం చెక్కుల రూపంలో.. మరికొంతకాలం పనివారల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నియామకం దగ్గర నుంచి కొన్ని నెలలు వేతనాలు అందలేదు. ఆ వేతనాలు దాదాపు 8 నెలలు ఉంటాయని కార్మికులు పేర్కొంటున్నారు. వాటితోపాటు 2017 డిసెంబరు నుంచి 2019 నెల ఫిబ్రవరి వరకు 14నెలల వేతనాలతో కలిపి మొత్తం 22 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది.
గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని 2,580 పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమల్లో ఉంది. అందులో 2014 ప్రాథమిక, 279 ప్రాథమికోన్నత, 287 ఉన్నత పాఠశాలలున్నాయి. చివరిసారి 2017 జూన్ నుంచి నవంబరు వరకు వేతనాలు అందజేశారు. 2017 డిశంబరు నుంచి 2018 ఆగస్టు వరకు కార్మికుల వేతనాలకు సంబంధించి ఇటీవలే రూ.5.23 కోట్లు విడుదలయ్యాయి. అవి ఇంకా సర్వశిక్ష అభియాన్ నుంచి వెలుగు ఖాతాకు సర్దుబాటు కాలేదు. 2018 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాన్ని మెప్మా పర్యవేక్షిస్తోంది. అలాగే అటవీశాఖ కొన్ని పాఠశాలల్ని ఎంపిక చేసుకుని పచ్చదనంతోపాటు శుభ్రత కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ రెండూ కలిపి గుంటూరు జిల్లాలో సుమారు 1500 పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి వేతనాలు గడచిన 22 నెలలుగా రావట్లేదు. రూ.10 కోట్లకుపైగా బకాయిలున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
స్వచ్ఛ భారత్ సాకారంలో భాగంగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2015 అక్టోబరులో ప్రయోగాత్మక పథకంగా కొన్ని మండలాల్లో అమలు చేశారు. 2016 ఫిబ్రవరి నుంచి మరికొన్ని.. 2017 ఏప్రిల్ నుంచి పూర్తిగా ఈ పథకాన్ని ఆచరణలోకి తెచ్చారు. అయితే కార్మికులకు వేతనాలు అందించకపోవడంతో పాఠశాలలో శుభ్రతపై కూడా అనుమానాలు ఉన్నాయి. అత్యధిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా అమలవుతోంది. అటవీశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అటు పచ్చదనం లేదు.. ఇటు శుభ్రతా చర్యలూ లేవు. కార్మికుల పేరుతో నగదు స్వాహాకు కొన్నిచోట్ల దొంగ హాజరు వేస్తున్నారనే విమర్శలున్నాయి.