యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. ప్రత్యర్థి నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 281కే పరిమితమైంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు షాకిచ్చారు. 11 పరుగుల వద్ద ధావన్ (1), 15 వద్ద రోహిత్ శర్మ (13) వెనుదిరిగారు. మరికాసేపటికే అంబటి రాయుడు (2) పెవిలియన్ చేరాడు. ఎంఎస్ ధోనీ (26; 42 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి విరాట్ కోహ్లీ (123; 95 బంతుల్లో 16×4, 1×6) నాలుగో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం అందించాడు. నిలదొక్కుకున్న ఈ జోడీని ధోనీని బౌల్డ్ చేయడం ద్వారా జంపా విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ (26) రాణించాడు. సారథి విరాట్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. 174 పరుగుల వద్ద కేదార్‌ను జంపా ఔట్ చేశాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ (32; 30 బంతుల్లో 4×4)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాదాడు. ఇది అతడి కెరీర్‌లో 41 శతకం కావడం గమనార్హం. జట్టు విజయం దిశగా వెళ్తున్న సమయంలో కోహ్లీని జంపా బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అప్పుడు స్కోరు 219. ఆ తర్వాత జడ్డూ (24)తో కలిసి శంకర్ పోరాడాడు. లైయన్ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడబోయి అతడు ఔట్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది.