YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బరి తెగిస్తున్న తెలుగు రాష్ట్రాలు మసక బారుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల ప్రతిష్ఠ

 బరి తెగిస్తున్న తెలుగు రాష్ట్రాలు మసక బారుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల ప్రతిష్ఠ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉన్నతాధికారులను రాజకీయ బాసులు ట్రాక్ తప్పించేస్తున్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చమని శాసిస్తున్నారు. శాంతిభద్రతలు, నేరపరిశోధన వంటివి మూలనపడిపోతున్నాయి. రాజకీయ కక్షసాధింపులకు పోలీసు యంత్రాంగం పనిముట్టుగా మారుతోంది. కేంద్రం అధీనంలోని దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖ వంటివి కావాల్సినంత అప్రతిష్ఠ ఇప్పటికే మూటగట్టుకున్నాయి. రాష్ట్రాలూ అదే బాటలో నడుస్తున్నాయి. మరింతగా బరి తెగిస్తున్నాయి. ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల ప్రతిష్ఠ మసకబారిపోతోంది. నిజాయతీపరులైన అధికారులకు నిలువనీడలేని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అప్రాధాన్యమున్న ప్రాంతాలు, శాఖలకు బదిలీ చేయించుకోవడం మినహా గత్యంతరం లేకుండా పోతోంది. ఇదీ తెలుగు రాష్ట్రాల్లోని దుస్థితి.
ఎస్ బాస్ అంటూ సాగిలపడే వారికి అన్నీ దక్కుతున్నాయి. కావాల్సిన చోట పోస్టింగు. అపరిమితమైన ప్రాధాన్యం. అవసరానికి మించిన సౌకర్యాలు సమకూరుతున్నాయి. నిబంధనల ప్రకారం నడుచుకుంటామన్న వారికి మాత్రం శంకరగిరి మాన్యాలు తప్పవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరస్పర కక్ష సాధింపు వైఖరుల కారణంగా నిన్నామొన్నటివరకూ కలిసి పనిచేసిన అధికారులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎదురవుతోంది. చినికిచినికి గాలివాన తరహాలో ఏపీ ఓటర్ల డేటా చోరీ రాజకీయ దుమారంగా మారిపోయింది. ఇందులో దాగి ఉన్న నేరం సంగతి ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసుకుని కత్తులు దూసుకుంటున్నాయి రెండు రాష్ట్రాలు. తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా సైతం గతంలోనే చోరీకి గురైందని కొత్త సమాచారం వెల్లడవుతోంది. ఈ సమాచారాన్ని అంతటినీ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు వినియోగిస్తున్న విషయం వాస్తవమని నిర్ధారణ అవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం రోడ్డెక్కి కాట్టాడుకునే సందర్భాలు అరుదుగా ఉంటుండేవి. నదీజలాల పంపకాలకు సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా ప్రాంతీయ ప్రభుత్వాలు భీష్మించుకుని కలహాలకు, ఘర్షణకు దిగుతుండేవి. ప్రజాప్రయోజనాలకోసం తాము పట్టుబడుతున్నామనే కలరింగ్ ఇస్తుండేవి. ఇప్పుడు ఆ విచక్షణను వదిలేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సర్కారులు యంత్రాంగాన్ని గరిష్టంగా దుర్వినియోగం చేయడానికి పూనుకున్నాయి. సిట్ లను ఏర్పాటు చేసి ఓటర్ల డేటా మీద మొత్తం విషయాన్ని కేంద్రీకరించాయి. ఒక ప్రభుత్వ పోలీసులపై మరొక ప్రభుత్వ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దేశానికంతటికీ వర్తించే చట్టాలు ఒకటే. ఇటువంటి సందర్భాల్లో కేంద్రం ఎంతమేరకు జోక్యం చేసుకోవాలనే విషయంలో స్పష్టత లేదు. రాజకీయ ప్రయోజనాల యావలో తెగేవరకూ లాగే ధోరణి పెరిగిపోయింది. రాజకీయ ఘర్షణ రాజ్యాంగ సంక్షోభంగా మారుతుందనే భయాందోళనలు ప్రజాస్వామ్య హితైషులు వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల నాయకులు పూర్తి ఖుషీగా కనిపిస్తున్నారు. డేటా చోరీ ఉదంతాన్ని తమకు అనుకూలంగా గరిష్ఠంగా ఎంతమేరకు వినియోగించుకోగలమనే కోణంలోనే వారు ఆలోచిస్తున్నారు. ఈ తేనె తుట్టను వైసీపీ కదిలించింది. తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. అయితే మొత్తం విషయాన్ని రివర్స్ చేయడం ద్వారా వైసీపీ, టీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు అయ్యాయని నిరూపించేందుకు అవకాశం దక్కుతోందని టీడీపీ భావిస్తోంది. తెలంగాణ దర్యాప్తు బృందాలకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక బృందాలను నియమించింది. అధికారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పని కత్తిమీద సాము మాదిరిగా తయారైందని వాపోతున్నారు. ఏపీ డీజీపీ ఠాకూర్ హైదరాబాదులో ఇల్లుకు సంబంధించీ నిబంధనల పేరిట ఉచ్చు బిగించడం అధికార వర్గాల్లో చర్చనీయమవుతోంది. ప్రభుత్వాలు ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉన్నతాధికారులపైనా కక్ష కడుతున్నాయి. నాయకులు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వారిమాటను కాదంటే తక్షణం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. చెప్పినట్లు చేసుకుపోతే దీర్ఘకాలంలో కెరియర్ పై మచ్చ పడుతుంది. ఈరెంటిలో దేనిని పాటించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Related Posts