యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ర్యాంకుల మోజులో పడిన విజయవాడ నగరపాలక సంస్థ క్షేత్రస్థాయిలో పారిశుధ్యాన్ని పూర్తిగా వదిలేసింది. ఒకవైపు అవార్డులు తీసుకుంటున్న నగరంలో పారిశుధ్యం నిర్వహణ అధ్వానంగా తయారైందని పర్యవేక్షణ అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా ఉన్న యుజిడి కారణంగా వీధులన్నీ మురుగు కంపుకొడ్తున్నాయి. చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలతో డ్రెయిన్లు నిండి మురుగుపారుదల లేకుండా పోయింది. స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగరంలో గుండా ప్రవహిస్తున్న పంట కాలువలకు నీటిని నిలుపుదల చేసిన నాలుగైదు మాసాలు అన్ని రకాల వ్యర్ధాలతో నిండిపోయి మురుగుకంపుకొడ్తున్నాయి. వీటి పరిధిలో దోమల బెడద తీవ్రంగా ఉంది.సంస్కరణల బాటలో నడుస్తున్న అధికార టిడిపి ఎక్కడైతే పేదలున్నారో అటువంటి ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. సిఎం క్యాంప్ ఆఫీసు, మహాత్మాగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్‌రోడ్డు, జాతీయ రహదారి ఇలా విఐపిలు ఎక్కడైతే పర్యటిస్తారో అటువంటి చోట్ల మాత్రమే అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా మురికివాడలు, కొండ ప్రాంతాలు, కృష్ణానది పరివాహక ప్రాంత నివాసాలు, శివారు కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. 61.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరంలో 3 లక్షల పైచిలుకు గృహాల దగ్గర నుంచి చెత్త సేకరించాల్సి ఉంది. ఇదే స్థాయిలో వేల కిలోమీటర్ల పొడవున డ్రెయిన్లు, రోడ్లు క్లీనింగ్, స్వీపింగ్ చేయాల్సి ఉంది. నగరంలో 111 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. రోజుకు నగరంలో 600 మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుంటుందని అధికారులు వివరిస్తున్నారు. తడి, పొడి చెత్తగా విభజించడం వల్ల పని భారం పెరిగినా దానికి తగ్గట్లు కార్మికుల భర్తీలేదు. నగరంలో సిఎం విజిట్ ఉందని ప్రతి డివిజన్ నుంచి ఐదారుగురు వర్కర్లను ప్రధాన రహదారులను స్వీపింగ్ చేయడానికి తరలిస్తున్నారు. అంతేగాక పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లకు పని చేయడానికి ఒకరిద్దరు చొప్పున వర్కర్లను ఉపయోగించుకోవడం బహిరంగ రహస్యం. ప్రజారోగ్య విభాగంలో అర్హత లేని అధికారులు ఏళ్ల తరబడి తిష్టవేసి ఉన్నారు. ఉన్నత స్థాయిలో పైరవీలు చేసుకుంటూ ఉండిపోతున్నారని పలుమార్లు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నగర మేయర్ ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ హెల్త్ మూడు సర్కిళ్ల పరిధిలో ఐదుగురు పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే అర్హత ఉంది. నగర వ్యాప్తంగా 59 డివిజన్లకు 48 మంది శానిటరీ ఇనిస్పెక్టర్లు పని చేయాలి. పర్మినెంట్ శానిటరీ ఇనిస్పెక్టర్లు కేవలం 25 మంది మాత్రమే పని చేస్తుండగా మిగిలిన 23 మందికి అర్హత లేదు. అనుభవం ఉందనే పేరుతో చివరకు సీనియర్ వర్కర్లను సైతం శానిటరీ ఇనిస్పెక్టర్లగా కొనసాగుతున్నారు. గతంలో 1600 మంది పర్మినెంట్ వర్కర్స్ ఉంటే నేడు కేవలం 600 లోపే ఉన్నారు. డ్వాక్వా సిఎంఇవై కార్మికులు 2900 మంది వరకు ఉన్నారు. పర్మినెంట్ వర్కర్లు, డ్వాక్వా సిఎంఇవై గ్రూపు కార్మికులు నిత్యం డివిజన్‌కు పది మంది వరకు వివిధ కారణాల రీత్యా సెలవుల్లో ఉంటారు. మస్టర్ వేయించుకొని పలువురు పర్మినెంట్, ఇతర కార్మికులను ఇంటికి పంపిస్తూ వారి కొచ్చే వేతనంలో అత్యధిక భాగం పర్యవేక్షణాధికారులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెత్త లిఫ్టింగ్‌కు ఉపయోగించే వాహనాలు వెహికల్ డిపోలోనే తుప్పుపట్టి నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించి సమూలంగా ప్రక్షాళన చేసి పారిశుధ్య మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.