యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
'మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు' ఇదీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రెండవ ట్రైలర్ లో ఉన్న డైలాగ్. ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదట నుంచి తమదే నిజమైన సినిమా అని చెబుతూ వస్తున్నారు. స్వర్గం నుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా తమకే ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైతే ఆయన సినిమా విడుదల తేదీని మార్చి 22గా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. దీని వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలు ఉన్నాయని..తమ అనుమతి లేకుండా సినిమా విడుదల చేయకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రెడీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అధికారికంగా విడుదల తేదీ వచ్చిన వెంటనే కోర్టును ఆశ్రయించేందుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రెడీ అయిపోయిందని చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమా కావటంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటానికి కూడా టీడీపీ రెడీ అవుతోంది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన జరిగిన పరిణామాలు..చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడు చేయటం వంటి అంశాలు ఈ సినిమాలో అత్యంత కీలకం కానున్నాయి. ఓ వైపు బాలకృష్ణ హీరోగా..నిర్మాతగా తెరకెక్కించిన ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన కథానాయకుడు, మహానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఘోర ఫలితాన్ని చవిచూశాయి. టీడీపీ డబ్బులిచ్చి ఉచితంగా మహానాయకుడు సినిమా షోలు వేస్తున్నా చూసేవారే కరువయ్యారనే రిపోర్టులు ఎన్టీఆర్ అభిమానులను మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఈ తరుణంలో అందరి చూపు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైప్ నెలకొంది. మరి కోర్టు అడ్డంకులు..ఈసీ అవాంతరాలు దాటుకుని వర్మ సినిమా విడుదల అవుతుందా? లేదా అంటే వేచిచూడాల్సిందే అని చెబుతున్నారు.‘ మరో వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన కామెంట్స్ చేశారు దర్శక, రచయిత పోసాని క్రిష్ణ మురళి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసాని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు అడ్డంకులు కలిగించే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ తప్పూ చేయకపోతే ఎందుకు భయపడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను ఈ సినిమా ఈవెంట్‌కి ఒక్క ఐదునిమిషాలు కూర్చుని వెళిపోదాం అని వచ్చాను. ఈ ఫంక్షన్లకు రావాలంటే భయం. ఎందుకంటే ఇక్కడకి వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి. అందుకే నా సొంత సినిమా ఫంక్షన్లని కూడా ఎగ్గొట్టా. కాని రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేశారని తెలియగానే రెండో ఆలోచన లేకుండా స్టేజ్ దగ్గరకు వచ్చా. శివ సినిమా అంత పెద్ద హిట్ అయిన తరువాత ఆయనతో పనిచేయడానికి ఇష్టపడతారు. శివ తరువాతి సినిమాకి రాము గారు నన్ను రైటర్‌గా పిలిచారు. అప్పడు నేను మద్రాసు యూనివర్శిటీలో పీహెచ్‌డీ చదువుతున్నా. నాకోసం వెతకడానికి రెండు రోజులు పట్టింది రాముగారి అసిస్టెంట్‌లకు. వాళ్లు వచ్చి మిమ్మల్ని రాము గారు తీసుకురామన్నారని చెప్పారు. నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నా.. ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేదు. నాకు కొంత టైం ఇవ్వాలని చెబితే.. నువ్ ఎప్పుడు రైటర్ అవ్వాలని అనిపిస్తే అప్పుడు రా.. ఇద్దరం కలిసి పనిచేస్తాం అని చెప్పారు రాము గారు. అన్నట్టుగానే ఆయన ‘రక్షణ’ సినిమాకి పిలిచి ఆఫర్ ఇచ్చారు. తరువాత మణి సినిమా ఆగిపోతే బయటకు తీసి నాతో రాయించారు. గాయం సినిమాకు మరో అవకాశం ఇచ్చారు. అంత అనుబంధం ఆయనతో ఉంది. రాముగారి గురించి మిగతా డైరెక్టర్లతో పోల్చడం నాకు నచ్చని పని కాని.. ఒక మాట చెప్పవచ్చు. భారతదేశంలో సినిమా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. కాని సినిమా పట్ల పూర్తి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. దటీజ్ ఆర్జీవీ. ఇది నేను ఆయన్ని దగ్గర నుండి చూశా.ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి చాలా మంది చెబుతున్నారు. ఈ సినిమా బయటకు రానివ్వరు. సెన్సార్ దగ్గర ఆపేస్తారు. పలానా పార్టీ వాళ్లు అడ్డుకుంటారు. థియేటర్స్ వద్ద గొడవ చేస్తారు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు? వెధవ వేషాలు వేయడం దేనికి? నువ్ నిజాయితీగా ఉండొచ్చు కదా.. ఎవడైతే నీతిగా ఉండడో.. నిజాయితీగా ఉండడో.. నీతి వంతమైన రాజకీయాలు చేయడో.. వాడికే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవడైతే వెధవ వేషాలు వేస్తాడో వాడికే కష్టాలు, కన్నీళ్లు, కోపాలు, బాధలు వస్తాయి. అవినీతి పనులు చేసిన వాడు.., వెన్నుపోటు పొడిచిన వాడే బాధ పడుతుంటాడు. నువ్ ఆరోజు ఆ పనిచేసి ఉండకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడుకదా.. రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా.. నువ్ వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసిన ఆయన మీద ఆయనే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేస్తే ఒప్పుకుంటాడు. నువ్ ప్రజాస్వామ్యంలో ఉండి.. ప్రభుత్వంలో ఉండి.. రాజకీయాల్లో ఉండి నువ్ లంగాపనులు చేస్తుంటే రాము ఎందుకు విడిచిపెడతాడు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు, వెధవ పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను సిటిజన్.. ఓటరు అందుకే అడిగే హక్కు ఉంటుంది. ఇక్కడ నుండి సెన్సార్ వాళ్లకు చెబుతున్నా.. ఇది జరిగిన కథ. సినిమాలో ఎవడు నీతి మంతుడు ఉన్నాడో వాడికి ఓట్లు పడతాయి. వెధవ పనులు చేశాడని ప్రజలు అభిప్రాయ పడితే ఖచ్చితంగా నాశనం అయిపోతాడు’ అంటూ చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు పోసాని .